ఎన్టీఆర్ జిల్లాలో 48 స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 3 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధికి గండి స్మార్ట్ కిచెన్‌లతో విద్యార్థులకు వేడివేడి భోజనం దూరం ఉద్యమ బాట పట్టనున్న కార్మికులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వేడివేడి భోజనం వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం స్మార్ట్‌గా వేటువేస్తోంది. స్మార్ట్ కిచెన్‌ల పేరుతో వారి ఉపాధికి గండికొట్టే చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సుమారు మూడు వేల మంది వంట కార్మికులు, సహాయకులు పని చేస్తున్నారు. సుమారుగా 21 సంవత్సరాలుగా అమలవుతున్న ఈ పథకంలో అప్పటి నుంచి వంట ఏజెన్సీల పేరుతో వంట కార్మికులు, సహాయ కులు సేవలు అందిస్తున్నారు. నామమాత్రం ఆదాయం తోనే వారంతా ఈ భోజన పథకంలో భాగస్వాములు అవుతున్నారు. గతంలో కుక్‌లకు కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వారి వేతనాన్ని అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేలకు పెంచి ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను రోడ్డుపాలు చేయడానికి కంకణం కట్టుకుందని వంట ఏజెన్సీల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
48 స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 883 ప్రభుత్వ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో సుమారుగా 81,821 మంది విద్యా ర్థులు చదువుతున్నారని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విద్యార్థులు అందరికీ ప్రస్తుతం వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజనాన్ని వండి వేడివేడిగా సకాలంలో వడ్డిస్తున్నాయి. అయితే స్మార్ట్ కిచెన్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ కిచెన్‌ల ఏర్పాటకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 48 స్మార్ట్ కిచెన్‌లను ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నట్లు తెలిసింది. జిల్లాలో 20 మండలాలు ఉండగా, ఒకొక్క మండలానికి రెండు స్మార్ట్ కిచెన్‌లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను బట్టి ఐదు మండలాల్లో మూడు చొప్పున, రెండు మండలాల్లో ఒకొక్కటి చొప్పున స్మార్ట్ కిచెన్‌లను ఏర్పాటు చేసేందుకు ఆ ప్రతిపాదనల్లో పేర్కొనట్లు సమాచారం. ఈ స్మార్ట్ కిచెన్‌ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక వేడి భోజనం దూరమే..
మండలంలో ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పాటు చేసే స్మార్ట్ కిచెన్‌ల ద్వారా మండలంలోని అన్ని పాఠశాలలకు భోజనం పంపిణీచేయాలి. ఫలితంగా పాఠశాలకు భోజనం చేరేసరికి చల్లారుతుంది. ఫలితంగా విద్యార్థులకు వేడి భోజనం దూరమవు తుంది. రాష్ట్రంలో విద్యారంగంపై కూటమి ప్రభుత్వం కక్ష్య కట్టిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. గోరుముద్ద పేరుతో ఆరు రోజులు అన్ని పోషకాలతో కూడిన భోజనం వేడివేడిగా వడ్డించేలా ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డొక్కా సీతమ్మ పేరు పెట్టినా ఆ పథకాన్ని నీరు గారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


