మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో అండర్–15 బాలికల టీమ్ జట్టు ఎంపికలను శనివారం నిర్వహించామని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. టీమ్ కెప్టెన్‌గా టి.సౌమ్య, సభ్యులుగా బి.కార్తిక, డి.షాలీనీచౌదరి, కె.అక్షయ, కె.మేఘన, ఆర్. లక్ష్మీప్రసన్న, పి.మోక్షశ్రీ, పి.లక్ష్మి లోహిత, ఆర్. తేజస్విని, కె.రుత్విక ఆరాధ్య, సీహెచ్.నిహారిక, ఆర్.వర్షిణి, కె.లాస్య, ఎన్.హరి ప్రియ, ఎం. ఆరాధ్య, స్టాడ్‌బైగా టి.సీహెచ్.దేవీచరణ్య, బి.గీతావర్షిణి, పి.హసీనా, ఎస్‌కే.ముస్కానా, డి.రిషిత, వి.కీర్తన, కోచ్‌గా ఎస్.రామ్‌కుమార్‌ను ఎంపిక చేశారు.
యువ స్టార్టప్‌లకు ఆహ్వానం
మధురానగర్(విజయవాడసెంట్రల్): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ శాఖ సౌజన్యంతో స్టార్టప్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ సహా ఎక్స్‌పోలో పాల్గొనడానికి యువ స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ స్టార్టప్ అవార్డులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రైజ్ మనీ ద్వారా ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. ఉత్తమ స్టార్టప్‌కు ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20 వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు అందజేస్తామని వివరించారు. విజయవాడ జోన్‌లోని అన్ని స్టార్టప్‌లు ఈ నెల 11వ తేదీ ఉదయం పది గంటలకు ఎనికెపాడులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సదవకాశాన్ని యువ స్టార్టప్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మానవ అక్రమ రవాణా కట్టడే లక్ష్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీకి సంబంధించిన కారణాలు, మార్గాలు, దర్యాప్తులో అనుసరించాల్సిన నిర్దేశిత విధి విధానాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో శనివారం శిక్షణ కార్యక్రమం జరిగింది. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఐజీ బి.రాజకుమారి, ఐజేఎం ప్రతినిధులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణలో ఆయా నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడేలా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెడ్డం రాజేశ్వరరావు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. సాంకేతికత ఆధారాలను గుర్తించడం, సంరక్షించడం, విశ్లేషించడం, వడాక్యుమెంట్ చేయడం వంటి వాటిని వివరించారు. ఆ సంఘటనలను పునర్నిర్మించడానికి, ప్రాసిక్యూషన్‌కు మద్దతు ఇవ్వడానికి చైన్ ఆఫ్ కస్టడీ, దర్యాప్తులో అనుసరించాల్సిన నిర్దేశిత విధివిధానాలపై అవగాహన కలిగించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ కేసులతో ప్రారంభం అవుతుందని, మిస్సింగ్ కేసులను ఉపేక్షించరాదని, వాటిని కట్టడి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, పలువురు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, యాంటీ ట్రాఫికింగ్, శక్తి బృందాల బాధ్యులు పాల్గొన్నారు.
ఫోన్ల రికవరీలో ద్వితీయ స్థానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలు పోగొ ట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు శనివారం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబుకు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపిన సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్నను సీపీ రాజశేఖరబాబు అభినందించారు.


