అభయాంజనేయునికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

అభయాంజనేయునికి విశేష పూజలు

May 10 2026 9:52 AM | Updated on May 10 2026 9:52 AM

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: కృష్ణాజిల్లా హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్ధానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మూడో రోజు శనివారం దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1008 లిల్లీ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై రాధాకృష్ణ భజన మండలి (కొయ్యూరు) భక్త బృందం సభ్యులు 108 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. విజయదుర్గ కోలాట బృందం (శేరినరసన్నపాలెం) మహిళలు ఆలయం వద్ద ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి వైభవంగా నిర్వహించారు. అనంతరం కళావేదికపై చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. నవజ్యోతి కళామందిర్‌ (గోపన్నపాలెం) ఆధ్వర్యంలో ‘పంచ రత్నాలు’ పేరిట ప్రదర్శించిన పౌరాణిక నాటక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు, ఆలయ పాలకమండలి చైర్మన్‌ వేమూరి శ్రీనివాసరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement