చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైన స్వయం ఉపాధి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. స్వయ సహాయక సంఘాల సభ్యులు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు పుట్ట గొడుగుల పెంపకం, డిజైనింగ్ వస్త్రాల తయారీపై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మీశ మహిళలనుద్దేశించి ప్రసంగించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే పుట్ట గొడుగుల పెంపకం మంచి ఆదాయ మార్గమని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగహన పెరుగుతున్న క్రమంలో పుట్ట గొడుగులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని వినియోగించుకుని ఆర్ధికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. పుట్టగొడుగుల పెంపకం, అవసరమైన ముడి సరుకులు, మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులు నాగరాజు మహిళలకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.


