ఏక్‌సాల్ కౌలు వేలం ఈ ఏడాదైనా అమలయ్యేనా? పెనమలూరు: కొండపల్లి ఖాజీ సర్వీస్ భూములు వక్ఫ్ పరిధిలో ఉన్నాయి. ఇవి పెనమలూరు మండలం తాడిగడప గ్రామంలో ఆర్‌ఎస్ నంబర్ 79లో 13.41 ఎకరాలు, 176లో 12.92 ఎకరాలు, 173లో 4.08 ఎకరాలు, పెదపులిపాక గ్రామంలో ఆర్‌ఎస్ నంబర్ 87లో 12.59 ఎకరాల సాగు భూమి ఉంది. గత 40 సంవత్సరాలుగా ఈ భూమికి కౌలు ఇవ్వకుండా కొంతమంది వ్యక్తులు సాగు చేశారు. టీడీపీకి చెందిన వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు.
వక్ఫ్ భూములు గత 40 సంవత్సరాలుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, కనీస ఆదాయం కూడా రావడం లేదని ‘సాక్షి’లో కథనాలు రావడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కొండపల్లి ఖాజీతో పాటు వక్ఫ్ అధికారులు సకాలంలో స్పందించారు. రెవెన్యూ అధికారులు ఏక్‌సాల్ కౌలు వేలం నిర్వహించటానికి తొలుత యత్నించగా ప్రైవేటు వ్యక్తులు హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఏక్‌సాల్ లీజ్ కౌలు వేలం పాట నిర్వహించి వివరాలు తమకు సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో గత జూన్ నెలలో పెనమలూరు తహసీల్దార్ కార్యాలయంలో అప్పటి తహసీల్దార్ గోపాలకృష్ణ బహిరంగ వేలంపాట నిర్వహించారు.
తహసీల్దార్ నిర్వహించిన ఏక్‌సాల్ కౌలు వేలం పాటలో 42 మంది రైతులు పాల్గొన్నారు. చివరకు నలుగురు రైతులు రూ.24,08,415కు కౌలు వేలం పాట గత సార్వా సీజన్‌లో సాగుకు పాట పాడారు. సొమ్ము కూడా డిపాజిట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అఽధికారులు కోర్టుకు ఏక్‌సాల్‌కౌలు వేలంపాట నివేదిక సమర్పించారు. కోర్టు ఆదేశాలు వస్తే వేలం పాట పాడిన రైతులకు సాగుకు అనుమతులు ఇస్తామన్నారు.
కోర్టులో ఉన్న కేసు పరిష్కారంలో తీవ్రజాప్యం జరగటంతో సార్వా సీజన్ ముగిసింది. కోర్టులో ఉన్న కేసు విషయంలో అధికారులు చొరవ తీసుకోకపోవటం, కౌలువేలం పాట నిర్వహించినా ఆదేశాలు అమలు జరగక పోవటంతో వక్ఫ్ ఆదాయానికి భారీగా గండి పడింది. వక్ఫ్ అఽఽధికారులు సకాలంలో కోర్టు దృష్టికి తీసుకురాక పోవటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా కోర్టు కేసులో పెండింగ్‌లో ఉన్న నిషేధ వక్ఫ్ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించి అక్రమంగా పంట సాగు చేసినా వక్ఫ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ప్రైవేటు వ్యక్తులు, టీడీపీ నేతలు అనధికారికంగా సాగు చేసిన పంట సొమ్ము కోర్టు కేసు పరిష్కరించే వరకై నా వక్ఫ్ బోర్డుకు డిపాజిట్ చేయించే విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ప్రైవేటు వ్యక్తులు పంటను పండించి నయాపైసా కట్టకుండా పంట తరలించుకుపోయినా వక్ఫ్ అధికారులు ప్రేక్షక పాత్రలో ఉండిపోయారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. వక్ఫ్ భూముల్లో ఎవరూ ప్రవేశించరాదని 145 సెక్షన్ విధించినా పట్టించుకునే నాథుడే కనబడలేదని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అత్యంత విలువైన ఖాజీ సర్వీస్ వక్ఫ్ భూములకు ఇకనైనా న్యాయం జరుగుతుందా అని ముస్లిం వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై వక్ఫ్ అధికారులతో పాటు ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే కోర్టు దృష్టికి తీసుకొచ్చి 2026–2027 సీజన్‌లో అయినా ఏక్‌సాల్ కౌలు లీజు అమలు చేయాలని కోరుతున్నారు. దీని వలన వక్ఫ్ బోర్డుకు ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు ఏవి..?
వక్ఫ్ భూముల పరిరక్షణలో ప్రభుత్వ చర్యలు ఏవని ముస్లిం సమాజం ప్రశ్నిస్తోంది. వక్ఫ్ బోర్డు నిద్రమత్తు వదిలి పేద ముస్లింలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అత్యంత విలువైన వక్ఫ్ భూములు గతంలో లాగా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
వక్ఫ్ భూములకు ఏడాది క్రితం వేలం నిర్వహణ
కౌలు వేలం అమలు కాక రూ.24 లక్షల నష్టం
కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా ప్రైవేటు వ్యక్తుల పంట సాగు
నిద్రమత్తు వీడని వక్ఫ్ బోర్డు
ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆదాయానికి భారీ గండి
ఏక్‌సాల్ కౌలు వేలం
వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
రూ.24 లక్షలతో కౌలు వేలం
సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం
ఈ ఏడాదైనా న్యాయం జరుగుతుందా..?
తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ సర్వీస్ వక్ఫ్ భూముల ఏక్‌సాల్ కౌలు వేలం ఈ ఏడాదన్నా అమలు చేస్తారా లేక ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం ఖాజీ సర్వీస్ భూములపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది కూడా వక్ఫ్ ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం ఉంది.