గ్రంథాలయ గోడు! | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయ గోడు!

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

ఉమ్మడి కృష్ణాలో నిధుల కోసం నిరీక్షణ ఉమ్మడి జిల్లాలోని 50 మండలాల్లో లైబ్రరీ సెస్‌ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు ప్రభుత్వం విడుదల చేయనే లేదు ఎన్టీఆర్‌ జిల్లా నుంచి రూ.68 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి రూ.14 కోట్లు బకాయిలు సిబ్బందికి జీతాల చెల్లింపు భారమే

రూ.27 కోట్లు పెండింగ్‌

సీఎం దృష్టికి ‘సెస్‌’ సమస్య

మచిలీపట్నంఅర్బన్‌: విజ్ఞాన భాండాగారాలను నిధుల కొరత వేధిస్తోంది. నిధుల కోసం నిరీక్షణతో లైబ్రరీల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రజల నుంచి గ్రంథాలయ సెస్‌ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా, అవి లైబ్రరీలకు చేరక ఉమ్మడి కృష్ణాలోని గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఆస్తి పన్ను, ఇంటి పన్నులపై లైబ్రరీ సెస్‌ వసూలు చేసి గ్రంథాలయ నిధికి జమ చేయాల్సి ఉంది.

నిధుల విడుదలలో జాప్యం

చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా 2024 నుంచి 2026 వరకు వసూలైన రూ.27 కోట్ల లైబ్రరీ సెస్‌ గ్రంథాలయాల ఖాతాలకు విడుదల కాలేదు. దీంతో ఇవి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి.

బకాయిల భారం

ఉమ్మడి జిల్లాలో లైబ్రరీల బకాయిలు మొత్తం రూ.82 కోట్లకు చేరాయి. ఇందులో ఎన్టీఆర్‌ జిల్లా నుంచి రూ.68 కోట్లు, ప్రస్తుత కృష్ణా జిల్లా నుంచి రూ.14 కోట్లు. నిధుల కొరతతో కొత్త పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు కుంటుపడ్డాయి. సిబ్బందికి జీతాలు చెల్లించడమే భారంగా మారింది. కనీస నిర్వహణకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

110 గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో గ్రంథాలయాల విస్తరణ ఉన్నా సిబ్బంది కొరత, భారీ బకాయిల సమస్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో మొత్తం 110 గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో 1 గ్రామీణ గ్రంథాలయం, 8 గ్రేడ్‌–1, 18 గ్రేడ్‌–2, 83 గ్రేడ్‌–3, గ్రంథాలయాలు ఉన్నాయి. అన్నింటిలో సుమారు 15,60,597 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

నాడు వైఎస్సార్‌ హయాంలో

నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సెస్‌ వసూళ్లు నేరుగా గ్రంథాలయాల ఖాతాలకు జమయ్యేవి. వాటితో గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల నిర్మాణం, పుస్తకాల కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. పాత బకాయిలు విడుదలయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు.

ఖాళీ పోస్టులతో ఇబ్బందులు

జిల్లాలో అవసరమైన 43 రికార్డు అసిస్టెంట్లకు కేవలం 27 మంది మాత్రమే పని చేస్తున్నారు. 67 మంది ఆఫీస్‌ సబార్డినేట్ల స్థానాల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.

గ్రేడ్‌–1 పోస్టుల్లో 18 స్థానాలకు 7మంది, గ్రేడ్‌–2 పోస్టుల్లో 57 స్థానాలకు 19 మంది మాత్రమే ఉన్నారు. 61 లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్స్‌ అవసరముండగా, కేవలం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రంథాలయాలకు 2024–25, 26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి స్థానిక సంస్థల నుంచి భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉంది. విజయవాడ కార్పొరేషన్‌ నుంచి సుమారు రూ.15 కోట్లు, మచిలీపట్నం కార్పొరేషన్‌ నుంచి రూ.కోటి, గ్రామ పంచాయతీల నుంచి రూ.8.5 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ.3 కోట్లు వసూలైన లైబ్రరీ సెస్‌ జిల్లా గ్రంథాలయ సంస్థకు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రెగ్యులర్‌గా పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.

గ్రంథాలయాలకు పెండింగ్‌లో ఉన్న ‘గ్రంథాలయ సెస్‌’ బకాయిల సమస్యను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్‌ డీకే బాలాజీకి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎం.ఎస్‌. బేగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని కలెక్టర్‌ ప్రస్తావించారని తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, చట్టరీత్యా సెస్‌ బకాయిల చెల్లింపునకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్‌ బాలాజీ ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఇందుకు గ్రంథాలయ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బేగ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement