నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం విద్యార్థుల భద్రతే లక్ష్యం బేస్‌బాల్‌ నేషనల్స్‌కు ముగ్గురు నాగాయలంక బాలికలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. నగరంలోని పటమటకు చెందిన పాలకొండ తులసి రాంబాబు, రమాదేవి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే బస్సుల్లో తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని విజయవాడ డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎం.పురేంద్ర తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రవాణా శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని స్కూల్స్‌, కాలేజీ బస్సులను ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1,571 విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయని, వాటిపై ఈ నెల 1 నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి సుమారు 130 బస్సుల చొప్పున తనిఖీ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 250 బస్సులను తనిఖీ చేయగా, ఈ నెల 20 లోపు తాము గుర్తించిన లోపాలు సరిచేయాలని ఆదేశించామన్నారు. తనిఖీల సందర్భంగా బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే విధానంపై ఎవాక్యువేషన్‌ డెమో నిర్వహించడంతో పాటు, ఫైర్‌ ఎక్స్టింగ్విషర్ల వినియోగంపై డ్రైవర్లు, అటెండర్లు, విద్యాసంస్థల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు పురేంద్ర తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను పూర్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి, నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పురేంద్ర విజ్ఞప్తి చేశారు.

నాగాయలంక: బేస్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఈ నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా గోనిగండ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగిన బేస్‌బాల్‌ బాలికల సబ్‌ జూనియర్‌ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు ద్వితీయ స్థానం పొందింది. ఈ జట్టులో నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌ బాలికలు 10మంది ఉన్నారని హెచ్‌.ఎం పద్యాల రఘురామయ్య, పి.డి గాజుల లక్ష్మీ ప్రసాద్‌ శుక్రవారం విలేకరులకు చెప్పారు. వీరిలో అత్యుత్తమ క్రీడా ప్రతిభ చాటిన బాలికలు సబ్బినేని ఉష్మిత, పూషడపు వల్లిశ్రీ, పురమ లీలశ్రీ నేషనల్‌ జట్టులో స్థానం పొందారన్నారు. మే 22న భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ బేస్‌బాల్‌ పోటీల్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభతో రాణించిన ముగ్గురు బాలికలు జాతీయ స్థాయికి ఎంపి కై న రాష్ట్ర జట్టులో ప్రాతినిధ్యం వహిస్తారు. నేషనల్స్‌కు ఎంపికై న ముగ్గురు బాలికలను పాఠశాల విద్యాకుటుంబం అభినందించింది.

Advertisement
 
Advertisement
Advertisement