చిరు వ్యాపారులపై కక్ష సాధింపు | - | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులపై కక్ష సాధింపు

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

సీఐటీయూ ఎన్టీఆర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం చిరువ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ ఆరోపించారు. బీసెంట్‌ రోడ్డు మహంతి మార్కెట్‌ వద్ద శుక్రవారం హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే జోన్ల విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ చిరు వ్యాపారస్తుల తోపుడుబండ్ల యూనియన్‌( సి.ఐ.టి.యు)ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ నగరంలో 30వేల మందికి పైగా ఉన్న చిరువ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించకపోగా వారిపై కక్ష సాధింపులకు దిగడం సరికాదని హితవు పలికారు. హాకర్లు నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన, మార్కెట్లలో, కూడళ్ల వద్ద తోపుడు బండ్లు, సైకిళ్లు, రిక్షాల ద్వారా వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం రెడ్‌, గ్రీన్‌, అంబర్‌ జోన్ల విధానాన్ని తీసుకొస్తోందన్నారు. ఈ విధానంతో హాకర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధానాన్ని తీసుకొస్తే అప్పట్లో పోరాటాల ద్వారా తిప్పి కొట్టామని గుర్తు చేశారు. గతంలో హాకర్లు ఐక్యంగా పోరాడారని, ఫలితంగా ఆ విధానం రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అదే విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని విజయవాడ హాకర్స్‌– తోపుడు బండ్ల యూనియన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కార్యక్రమంలో కె. దుర్గారావు, ఎం.సోమేశ్వరరావు, సీహెచ్‌ మురళి, బాలబొమ్మ లక్ష్మణ, ఎస్‌.కె మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement