వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

May 9 2026 9:37 AM | Updated on May 9 2026 9:37 AM

ఏపీసీపీడీసీఎల్‌ చైర్మన్‌ పొగాకు పుల్లారెడ్డి

ఇబ్రహీంపట్నం: వేసవి కాలంలో వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్‌ చైర్మన్‌, ఏపీజెన్‌కో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ పోగాకు పుల్లారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ రూరల్‌ డివిజన్‌ కార్యాలయం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. రూరల్‌ డివిజన్‌ కార్యాలయం, విద్యుత్‌ ఉద్యోగుల విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలకు సోలార్‌ ప్లేట్లను ఏర్పాటు చేయడంలో లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. హెచ్‌టీ, ఎల్టీ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాకు కృషి చేయాలని సూచించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం, అంబారుపేట, మక్కపేట ఏరియాలో మూడు నూతన సబ్‌ స్టేషన్‌లను సుమారు రూ.14 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. టెక్నికల్‌ డైరెక్టర్‌ ఎ.మురళీకృష్ణ యాదవ్‌, ఎస్‌ఈ యు.అన్నమయ్య, పలువురు ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

కంటెయినర్‌ లారీ ఢీకొని కూలీ మృతి

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని కంటైనర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కొండపల్లి ఆప్మెల్‌ సెంటర్‌లో 30వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. ఆప్మెల్‌ సెంటర్‌కు చెందిన వేముల వెంకటేశ్వరరావు (37) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. కూలి పనికి వెళ్లి తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో తన టీవీఎస్‌ మోపెడ్‌పై ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో హైవేపై మలుపు తిరుగుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు విజయవాడ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement