జి.కొండూరు: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేదిలేదని జి.కొండూరు మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని మునగపాడు, సున్నంపాడు గ్రామాల పరిధిలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నిధులతో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమిని అక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రభుత్వ భూమిపై పచ్చనేతల కన్ను’ కథనాన్ని సాక్షి శుక్రవారం ప్రచురించింది. ఈ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇన్‌చార్జ్ తహసీల్దార్ విజయ్‌కుమార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు బృందం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కంప చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లకపోతే జేసీబీలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు.


