నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు రవాణాశాఖ తనిఖీల్లో వెల్లడవుతున్న వాస్తవాలు వాటిని సరిదిద్దాలని నిర్వాహకులకు నోటీసులు సవరించిన తర్వాతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మంజూరు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే పలు బస్సుల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. రవాణాశాఖ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అవి బయటపడుతున్నాయి. ఈ లోపాలను గుర్తించిన అధికారులు, వాటిని సరిచేయాలంటూ ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. పదిహేను రోజుల్లో ఆ లోపాలను సరిచేస్తేనే మళ్లీ తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రెండువేలకు పైగా స్కూల్, కళాశాల బస్సులు ఉండగా, ఇప్పటి వరకూ 250 బస్సులను రవాణాశాఖ అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి. పలు బస్సుల్లో లోపాలు గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాయి.
గుర్తిస్తున్న లోపాలు ఇవీ..
రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్‌టీడీ డివైజ్‌లు లేక పోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయటకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయక పోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. వాటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హ్యామర్లు బస్సులో అందుబాటులో లేక పోవడం, మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్‌మెంట్ లేక పోవడం, ఎక్స్‌పైరీ డేట్‌తో ఉండటం వంటి వాటిని రవాణా శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. పిల్లలను తీసుకెళ్లే స్కూల్, కళాశాల బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు.
వీటిపైనే దృష్టి..
రవాణాశాఖ అధికారులు వారి తనిఖీల్లో ముఖ్యంగా టైర్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎక్కే డోర్ మెట్లు సక్రమంగా ఉన్నాయా, గ్రిల్స్, సీట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్, వైఫర్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, గ్లాస్, బస్సు కండీషన్, రూఫ్ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు బయటకు వచ్చేందుకు ఎమర్జెన్సీ డోర్ సరిగాయ ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు.
రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్కూల్స్, కళాశాలల బస్సులను తనిఖీ చేస్తున్నాం. భద్రతా ప్రమాణా లయిన ఏఐఎస్–63, ఏఐఎస్ –52, ఏఐఎస్ –135, ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్స్‌లోని 185(జీ), 125(హెచ్) ప్రకారం పరిశీలన చేస్తున్నాం. తనిఖీల్లో నిబంధనల ప్రకారం లేని బస్సులకు సంబంధించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి, 15 రోజుల్లో సరిదిద్దుకోవాలని ఆదేశిస్తున్నాం. వాటిని సరిదిద్దిన తర్వాత మరో సారి తనిఖీ చేసి అన్నీ బాగుంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తాం. ఇప్పటి వరకూ 200 బస్సుల వరకూ తనిఖీలు చేశాం.
– ఆర్.ప్రవీణ్,
ఆర్టీఓ, విజయవాడ
గత ఏడాది డిసెంబరులో స్కూల్, కళాశాలల బస్సులకు సంబంధించి రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు పది ప్రత్యేక బృందాలతో రెండు రోజుల పాటు 125 బస్సుల వరకూ తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో స్కూల్ బస్సు డ్రైవర్ వయస్సు, అనుభవం, లైసెన్స్, అత్యవసర ద్వారం ఇతర అంశాలను తనిఖీ చేశారు. రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో స్కూలు బస్సుల డొల్లతనం బయటపడింది. ఏకంగా 28 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అలాంటివి చోటుచేసుకోకుండా ముందస్తుగానే తనిఖీలు చేస్తున్నారు.


