చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది

మైలవరం(ఇబ్రహీంపట్నం): ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ మైలవరం నియోజకవర్గం సమన్వయ కర్త జోగి రమేష్‌ విమర్శించారు. మైలవరం వ్యవవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వరి, మొక్కజొన్న కొనుగోలు చేసేవారు లేక 15 రోజులుగా రైతులు ఎదురుచూస్తున్నారు. వారికి మద్దతుగా ర్యాలీగా ఏఎంసీ యార్డ్‌కు చేరుకున్న జోగి రమేష్‌ రైతులకు అండగా నిలిచారు. పంటకు పెట్టిన పెట్టుబడి, ప్రభుత్వం కొనుగోలు చేయక కలిగిన నష్టాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. కనీసం పట్టాలు, గోనె సంచులు ఇచ్చిన నాథుడు లేడని రైతులు జోగి రమేష్‌కు ఫిర్యాదు చేశారు. 15 రోజులుగా ఏఎంసీలో తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మొక్కజొన్న, ధాన్యం ఏమవుతుందో తెలియడంలేదని ఆందోళన వారు వ్యక్తం చేశారు.

రైతులకు సంచులనూ సరఫరా చేయలేరా?

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ తీరును జోగి రమేష్‌ తీవ్రంగా ఖండించారు. కనీసం ధాన్యం సంచులను కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం రైతులకు ఏమి మేలు చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులను ఆదుకునే దిశగా కలెక్టర్లకు సూచనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న, వరి రైతుల సమస్యలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 చెల్లించి రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రైవేట్‌ వ్యక్తులు క్వింటాకు రూ.1750 చొప్పున కొంటామనడం రైతులను నిలువునా దోచుకోవడమేనని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని, కనీసం సంచులు, పట్టాలు, ట్రాన్స్‌ పోర్టు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతులు స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్‌ చేస్తే కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో ఆయన లేడన్నారు. ఆయనకు పావలా వాటా కోసం పోరాడటంతోనే సరిపోతోందని ఎద్దేవా చేశారు. మైలవరం నియోజకవర్గంలో రైతుల పరిస్థితిని సీఎం చంద్రబాబు ఒక సారి వచ్చి పరిశీలించాలన్నారు. సత్వరమే రైతుల ధాన్యం కొనుగోలు చేసి వెంటనే నగదు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులు సమస్యలు పరిష్కరించకుంటే రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గరికపాటి శ్రీదేవి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అప్పిడి సత్యన్నారాయణరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు వేములకొండ తిరుపతిరావు, నాగు లూరి దుర్గాప్రసాద్‌, పామర్తి శ్రీనివాసరావు, పచ్చిగోళ్ల పండు, నల్లమోతు ప్రకాష్‌, నల్లమోతు దయాకర్‌, దేవరకొండ ఆంజనేయులు, జడ రాంబాబు, రెంటపల్లి నాగరాజు, పాల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్‌

Advertisement
 
Advertisement
Advertisement