పేదలపై కత్తికట్టిన చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వం రాజధానిలో కేటాయించిన ఇళ్ల స్థలాలు రద్దు ఆ భూములు సీఆర్‌డీఏకు అప్పగించాలని నిర్ణయం లబ్ధిదారులకు టిడ్కో గృహాలంటూ హడావుడి రెండేళ్లు గడచినా చర్యలు శూన్యం సొంతింటి కోసం పేదల ఎదురుచూపులు
కూటమి కల్లబొల్లి మాటలు..
ఇచ్చిన స్థలాలు రద్దు చేశారు..
చెదిరిన కల..
విజయవాడలోని 27వేల కుటుంబాల ఆశలు గల్లంతు
గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో మాకు ఇంటి స్థలం కేటాయించడంతో ఎంతో సంతోషించాం. కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో మాకిచ్చిన స్థలాలు రద్దు చేశారు. వాటి స్థానంలో మరోచోట ఇస్తామంటూ అప్పట్లో హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆ హామీ నెరవేరలేదు. మాకు సొంతిళ్లు కలగానే మిలిలేలా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి. లబ్ధిదారులకు స్థలాలతో పాటు ఇల్లు కట్టుకునేందుకు సహకరించాలి.
– జె. కోటేశ్వరి, కృష్ణలంక
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదలపై చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే.. రాజధానిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కత్తి కట్టింది. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని సరికొత్త భాష్యం చెప్పింది. అమరావతిలో పేదలు ఉండకూడదనే పంతాన్ని నెగ్గించుకొంది. గత నెలలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పేదలకు కేటాయించిన భూములను రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్‌డీఏకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. పైగా ఈ లబ్ధిదారులకు టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తామని హామీనిచ్చి వారిని మభ్యపెడుతోంది. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఈ అంశం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది.
విజయవాడ నగరంలోని 27,031 మంది పేదలతో పాటు గుంటూరు జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను 2023 మే నెలలో మంజూరు చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని అనంతవరం, కురగల్లు, మందడం, నిడమర్రు, పిచ్చుకలపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 737 ఎకరాల విస్తీర్ణంలో ఆర్–5 జోన్ పేరిట 14 లేఅవుట్లను సిద్ధం చేసి, జియో ట్యాగింగ్ పూర్తి చేసింది. ఆ లేఅవుట్లను చదును చేసి, అంతర్గత రోడ్లు వేయడంతోపాటు మౌలిక వసతులకు సంబంధించిన పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చి, ఇళ్లకు శంకుస్థాపన సైతం చేసింది. అయితే రాజధాని రైతులు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఫుల్ బెంచ్ స్టే ఇవ్వడంతో నిర్మాణాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. దానిని తొలగించాలని గత ప్రభుత్వం పేదల తరఫున సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ దశలో ప్రభుత్వం మారడంతో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే పేదలపైన కక్షపూరితంగా వ్యవహరించింది. సీఆర్‌డీఏ పరిధిలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలు రద్దు చేసింది.
పేదల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. మాకు కూడా స్థలం వచ్చింది. దీంతో సొంత ఇల్లు నిర్మించుకోవచ్చని చాలా సంబరపడ్డాం. కానీ మా ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం మాకిచ్చిన స్థలాలను రద్దు చేసింది. మరో ప్రాంతంలో ఇస్తామని హామీ ఇచ్చారే కానీ, ఇప్పటి వరకూ వాటి ఊసే లేదు. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మాలాంటి వారి సొంతింటి కలను నిజం చేయాలి.
– పంతాల విజయకుమారి, కృష్ణలంక
గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాల స్థానంలో ఎక్కడి వారికి అక్కడే పేరుతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని లబ్ధిదారులకు టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తామని కూటమి ప్రభుత్వం పేదలను మభ్య పెట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో 260, గుంటూరు జిల్లాలో 210 ఎకరాలు టిడ్కో గృహా నిర్మాణాల కోసం స్థలం అవసరం అవుతోందని, స్థలాన్వేషణ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అయితే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం ఆరు దశల్లో జల్లెడ పట్టి, అర్హులైన పేదలను గుర్తించింది. చంద్రబాబు సర్కారు ఇంటి పట్టాలు మంజూరైన జాబితాలను పరిశీలించి, అర్హులను గుర్తిస్తామంటూ చెప్పినప్పటికీ ఆ దిశగా ఏ మాత్రం అడుగులు పడకపోవటంతో, ఇళ్ల స్థలాలు మంజూరైన పేదలు చంద్రబాబు సర్కారు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


