కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని బొమ్మల ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం సందర్శించారు. ఇటీవల నిర్వహించిన కొండపల్లి బొమ్మల ఉత్సవం విజయవంతమైన నేపథ్యంలో హస్తకళాకారులు సరికొత్త ఉత్సాహం, వినూత్న డిజైన్లతో కళాత్మక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన కొనియాడారు. కొండపల్లి బొమ్మల ఉత్సవంపై కళాకారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హస్తకళాకారుల ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ విస్తరణ, సాంకేతిక సహాయం, ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. కొండపల్లి బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
మురుగునీటి శుద్ధీకరణకు చర్యలు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని మురుగునీటిని శుద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు యూనిడో ప్రతినిధులకు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర వివరించారు. బుధవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్‌లోని సమావేశపు గదిలో యూనిడో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనిడో నిధులతో చేపట్టిన రామలింగేశ్వర నగర్‌లో 20ఎంఎల్‌డీ సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సింగ్‌నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర నగర్‌లో గల గ్యాస్ జనరేషన్ ప్లాంట్ గురించి సమీక్షించారు. జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేసి, త్వరగా నగరంలోని వాడుక నీరు మొత్తం శుద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ ఇంజినీర్ ఇన్‌చార్జ్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేఖ, యూనిడో ప్రతినిధులు డాక్టర్ ఎంపీ సింగ్, దీపిక, ఎన్‌యూ గౌరవ వర్మ, ఇంజినీరింగ్ సిబ్బంది ాల్గొన్నారు.
కొత్త ఆర్డీవోల
ప్రమాణ స్వీకారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో)గా వెన్నెల శ్రీను బుధవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డీవోకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
నందిగామ ఆర్డీవోగా అనిల్‌కుమార్
నందిగామ రూరల్: డివిజన్‌లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆర్డీవో అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నందిగామ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించిన పోసిబాబు అటవీశాఖకు బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో పని చేస్తున్న అనిల్ కుమార్ ఇక్కడకు వచ్చారు.
హనుమజ్జయంతికి ఏర్పాట్లు
తాడేపల్లి రూరల్: హనుమజ్జయంతి వేడుకలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజులు కైంకర్యాలు జరుగుతాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.


