పామర్రు: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ అన్నారు. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం చోరగుడి, కూడేరు శివారు సమితగుంట గ్రామంలో మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మొక్కజొన్న రైతులను పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరామర్శించారు. ఆరబోసిన మొక్కజొన్నను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
హామీల అమలేది?
అనంతరం అనిల్‌కుమార్ మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రైతులు, ప్రజలకు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఇది నెరవేరిన దాఖలాలు లేవని చెప్పారు. గత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం బస్తా మద్దతు ధర రూ.1,775 ఉండగా.. రైతులు మాత్రం రూ.1000 నుంచి రూ.1,300లకే తెగనమ్ముకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ.2,300 ఉండగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తద్వారా రైతులు నష్టపోతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మందా శ్రీనివాస్‌రెడ్డి, పామర్రు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మర్రి బాబూరావు, పమిడిముక్కల మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలిమెట్ల కృష్ణ, వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్, మండల కోఆప్షన్ సభ్యులు అలీ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్


