ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక ఏపీసీపీడీిసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలతో సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు తీరు గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టర్(ప్రాజెక్టు) డైరెక్టర్ టీవీఎస్‌ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
రవాణా శాఖ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న పలువురికి సీనియర్ అసిస్టెంట్‌లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు బుధవారం ప్రాంతీయ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్ ఉద్యోగోన్నతి పత్రాలు అందజేశారు. కాగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉండటంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని, అర్హతగల జూనియర్ అసిస్టెంట్‌లకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఇటీవల రవాణాశాఖ ఉద్యోగులు సంఘం ప్రతినిధులు కలిసి విన్నవించారు. వారి వినతి మేరకు అర్హత గత జూనియర్ అసిస్టెంట్‌లకు సీనియర్ అసిస్టెంట్‌లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. దీంతో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రాజబాబు తదితరులు ఆర్‌జేటీసీ సుందర్‌ను కలిసి అభినందించారు.


