రైతులు సంఘటితమైతే అద్భుత ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

రైతులు సంఘటితమైతే అద్భుత ఫలితాలు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

తోట్లవల్లూరు: రైతులు సంఘటితంగా ముందుకు సాగి దళారీ వ్యవస్థను అధిగమించగలిగితే అద్భుత ఫలితాలు సాధించొచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని చాగంటిపాడులో ఉద్యానశాఖ సహకారంతో శ్రీవిఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యాన రూ.62 లక్షలతో ఏర్పాటు చేసిన పసుపు, కారం, కారప్పొడుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌ బాలాజీ సందర్శించారు. అరటి మార్కెట్‌లో విక్రయాల తీరును తెలుసుకున్నారు. రైతులు ఐకమత్యంగా ఉంటూ తాము పండించిన పంట ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా అమ్ముకోగలిగితే మంచి లాభాలు వస్తాయని, దీనికి గుజరాత్‌లోని అమూల్‌ సంస్థను ఉదాహరణగా తీసుకోవచ్చని సూచించారు. శ్రీవిఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ నిర్వహణ, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తుల అమ్మకాల కోసం ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులకు డివిడెండ్లు పంపిణీ చేశారు. నాబార్డు ఏజీఎం మిలేన్‌, జిల్లా వ్యవసాయశాఖాధికారి పద్మావతి, పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సీహెచ్‌.నరసింహులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి జె.జ్యోతి, డీఆర్‌ డీఏ పీడీ హరిహరనాథ్‌, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజు, తహసీల్దార్‌ కుసుమకుమారి, ఎంపీడీఓ రవికాంత్‌, నేస్తం ఎన్‌జీఓ సంస్థ సీఈఓ సురేష్‌, శ్రీవిఘ్నేశ్వర ఎఫ్‌పీఓ సీఈఓ కొల్లి స్వర్ణపూజిత, డైరెక్టర్లు కొల్లి కేశవచంద్రమోహన్‌రెడ్డి, జొన్నల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సచివాలయాల సందర్శన

చాగంటిపాడు, పెనమకూరు గ్రామ సచివాలయాలను కలెక్టర్‌ బాలాజీ సందర్శించారు. ఆయా సచివాలయాలను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చాగంటిపాడు మండల పరిషత్‌ పాఠశాలను బాలాజీ సందర్శించారు. అక్కడ గ్యారంటరీ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (జీఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, వలంటీర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్ట్రీమ్‌లైన్‌ విద్యార్థుల అభ్యాసన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెనమకూరులో డ్రోన్‌ ద్వారా విత్తనాలు చల్లే విధానాన్ని కలెక్టర్‌ బాలాజీ పరిశీలించారు. ఎంఈఓలు వెంకటేశ్వరరావు, సురేష్‌, డెప్యూటీ ఎంపీడీఓ శాంసన్‌బాబు, ఈఓపీ ఆర్‌డీ వెంకటేశ్వరమ్మ, ఏఓ గూడపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement