గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎం.ఎస్‌.బేగ్‌ అధ్యక్షతన కేంద్ర గ్రంథాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునికీరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను సభ్యులు ఆమోదించారు. జిల్లాలోని అనేక శాఖా గ్రంథాలయ భవనాలకు భవనాలకు రంగులు వేయడానికి నిధులు కేటాయించాలని నిర్ణయించారు. బంటుమిల్లిలో కొత్త శాఖా గ్రంథాలయ భవన నిర్మాణానికి కొమ్మారెడ్డి బ్రదర్స్‌ 406.5 చదరపు గజాల భూమిని దానం చేయడానికి అంగీకరించగా, ఆ భూమిని గ్రంథాలయ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది.

డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం

ఉమ్మడి జిల్లా పరిధిలోని 109 శాఖ గ్రంథాలయాల కోసం ప్రతి గ్రంథాలయానికి రెండు సీసీ కెమెరాలు, ఒక కంప్యూటర్‌ సమకూర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 70 గ్రంథాలయాలకు కంప్యూటర్లు ఉండగా, మిగిలిన గ్రంథాలయాల కోసం 60 కంప్యూటర్లు కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ కోసం ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించారు. గ్రంథాలయాల ఆధునికీకరణకు సంబంధిం రూ.5 లక్షల లోపు పనులను జిల్లా స్థాయిలోనే నామినేషన్‌ పద్ధతిలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రంథాలయాలను ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్న విద్యాసంస్థలుగా పరిగణించి, ప్రాపర్టీ టాక్స్‌ను సెక్షన్‌ 80సీ ప్రకారం రద్దు చేయాలని, ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరాలని నిర్ణయించారు. పాతబడిన, ఉపయోగం లేని పుస్తకాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించడంతో పాటు, దెబ్బతిన్న ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తొలగించేందుకు అనుమతి కోరాలని నిర్ణయించారు. పాఠకుల అభ్యర్థన మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఈ సంద ర్భంగా తీర్మానించారు.

భవనాల మార్పులు, సౌకర్యాలు..

ఎలమరు శాఖ గ్రంథాలయ భవనం నిర్మాణ పనుల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను తాత్కాలికంగా వేరే భవనానికి తరలించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మధురానగర్‌ శాఖ గ్రంథాలయాన్ని వేరే భవనానికి మార్చా లని నిర్ణయించారు. అవసరమైన గ్రంథాలయాల్లో ఎయిర్‌ కండీషనర్లు ఏర్పాటు చేయడానికీ కమిటీ ఆమోదం తెలిపింది. అజెండాలోని పలు అంశాలను అధ్యక్షుల అనుమతితో సభ్యులు సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్‌ వయోజన విద్య డీడీ హాజీబేగ్‌, సమాచార పౌర సంబంధాలశాఖ డీడీ ఎం.వెంకటేశ్వర ప్రసాద్‌, విద్యాశాఖ ఏడీ విద్యాలత, ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖ డీసీఆర్బీ అధికారి ఉమర్‌ అలీ, డీఎల్పీఓ రజావుల్లా, ఎన్టీఆర్‌ డీపీఓ కార్యాలయం ఏఓ రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement