పెరిగిన గ్యాస్‌ ధరలతో చిరు వ్యాపారులు కుదేలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన గ్యాస్‌ ధరలతో చిరు వ్యాపారులు కుదేలు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పెంచిన గ్యాస్‌ ధరలతో చిరు వ్యాపారులు కుదేలయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. గ్యాస్‌ ధర పెంపునకు నిరసనగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కాళేశ్వరరావు మార్కెట్‌, పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌ వద్ద నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఆందోళన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో నెలవారీ బడ్జెట్‌ పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు కమర్షియల్‌ గ్యాస్‌ సిలెండర్‌ ధర పెంపుతో పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా గ్యాస్‌ ధరలు అమాంతం పెంచడం ప్రజలను వంచించడమేనని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.3,251.50కి చేర్చారన్నారు. దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ‘అచ్చే దిన్‌’ అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాన్యుడికి ‘చచ్చే రోజులు’ తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, కార్యవర్గ సభ్యులు ఇ.రమణబాబు, తూనం వీరయ్య, ఓర్సు భారతి, నజీర్‌, నాయకులు బండల రాజు, కంచర్ల నాగేశ్వరరావు, కరోతి వెంకటేశ్వరరావు, బెవర శ్రీనివాసరావు, బుర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement