త్రినేత్రిగా చిన్నారికి నామకరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): మానవత్వంతో పసికందును రక్షించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. చిన్నారికి త్రినేత్రి అని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు నామకరణం చేశారు. గత నెల 11వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణలంక రైతుబజార్ వెనుకవైపు జాతీయ రహదారి పక్కనే ఉన్న బాత్‌రూంలో పాలకొల్లు ప్రాంతానికి చెందిన ఒక మహిళ పసికందును ప్రసవించి అక్కడే వదిలి వెళ్లిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే స్పందించి చిన్నారిని రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. సీసీ పుటేజీ ఆధారంగా పాప తల్లిదండ్రులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం చిన్నారిని వారి చెంతకు సురక్షితంగా చేర్చారు. పోలీసుల స్పందనను అభినందిస్తూ పాలకొల్లుకు చెందిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లా డుతూ.. మూడో కన్నులా పనిచేసిన సీసీ కెమెరాల సహాయంతో కుటుంబ సభ్యులను గుర్తించిన నేపథ్యంలో చిన్నారికి త్రినేత్రి అని పేరు పెట్టినట్లు తెలిపారు. సాంకేతికత కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాకుండా ప్రాణాలను కాపాడటానికీ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్, కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ నాగరాజు, నల్లి రాజేష్, చిన్నారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


