బుడమేరు హామీలు.. వరదలకే సరి | - | Sakshi
Sakshi News home page

బుడమేరు హామీలు.. వరదలకే సరి

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలను చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది. బెజవాడ దుఃఖదాయనిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతోంది. బుడమేరు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయటం లేదు. వర్షాకాలాన్ని తలచుకొని బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. 2024లో బుడమేరు అనుభవాలు నీడలా వెంటాతుండటంతో అక్కడ ప్రజల్లో భయాందోళనలు తొలగిపోవటం లేదు. వరదలకు ముందు ఆప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. తరువాత వరద ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. రియల్‌ రంగం కుదేలైంది. స్థిరాస్తి లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. వరదలు వచ్చి 20 నెలలు గడుస్తున్నా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం పనులు చేపట్టటం లేదు. ఈ వేసవిలో పనులు చేయకపోతే మళ్లీ వర్షాకాలం ఆందోళనకరమేనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

బాబు మాటలు నీటిమూటలే

బుడమేరుకు 2024 ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారానికిపైగా విజయవాడ కలెక్టరేట్‌లో బసచేసి హడావుడి చేశారు. విజయవాడలో ముంపు నివారణ కోసం ఎన్నికోట్లు అయినా ఖర్చుచేస్తామంటూ ఆర్భాటంగా చెప్పారు. అంతే.. తరువాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. బుడమేరు ఆధునికీకరణకు నిధుల కేటాయింపులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మొదటిదశలో బుడమేరు ప్రక్షాళన కోసం రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కేవలం గేట్ల మరమ్మతు పనులతో సరిపెట్టారు. గత ఏడాది బుడమేరు గండ్లు పూడ్చివేతకు రూ.43.25కోట్లు మాత్రం మంజూరు చేశారు. ఇందులో కూడా నిబంధనలకు తిలోదకాలిచ్చారు. నిధుల మంజూరుకు ముందే తూతూ మంత్రంగా గండ్లు పూడ్చిన 18 పనులకు సంబంధించి రూ.20కోట్ల పనులకు టెండర్లు పిలిచి మమ అనిపించారు. మిగిలిన రూ.23 కోట్ల పనుల గురించి పట్టించుకోలేదు. తాత్కాలికంగా గండ్లు పూడ్చినా.. కట్టల బలోపేతం, పూడికతీత, సెక్షన్‌ చేయడం వంటి పనుల ఊసేలేదు.

ప్రతిపాదనలకే పరిమితం..

మొదటిదశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని 5వేల క్యూసెక్కుల నుంచి 10వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. 13.25 కిలోమీటర్ల వరకు బుడమేరు ఆక్రమణలకు గుర్తెంది. ఇందులో విధ్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 202 ఎకరాలకుగాను 70 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఈ ఆక్రమిత భూమిలో 3,051 ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించేలా ప్రణాళిక రచించారు. దీంతోపాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎనికేపాడు–కొల్లేరు మధ్య 50.6 కిలోమీటర్ల మేర కాలువ గట్లను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఇవన్నీ ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. ఈ వేసవిలోనైనా పనులు చేస్తే వర్షాకాలం ముప్పును తప్పించే అవకాశం ఉంది.

అటకెక్కిన బుడమేరు

అధునికీకరణ పనులు

పలుచోట్ల కనీసం గండ్లుపూడ్చని వైనం

విజయవాడ నగరంలో

తొలగించని ఆక్రమణలు

బుడమేరు పరీవాహక ప్రాంత

ప్రజల్లో తొలగని భయాలు

ఈ వేసవిలో పనులు చేస్తేనే

వర్షాకాలంలో నిశ్చింత

Advertisement
 
Advertisement
Advertisement