నిజాలు నిగ్గు తేలుస్తాం..
● జగనన్న కాలనీల లబ్ధిదారులకు
అన్యాయం జరిగితే సహించం
● గృహనిర్మాణశాఖ అధికారులపై
మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని
చిలకలపూడి(మచిలీపట్నం): జగనన్న కాలనీలకు సంబంధించిన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు 25వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిందన్నారు. అలాగే జిల్లాలో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి వారికి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే పాలకులు మారినా వారి హక్కులు మాత్రం మారవన్నారు. కావాలనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తూ, పలు అడ్డంకులు సృష్టించి.. లబ్ధిదారుల్లో ఉత్సాహం లేదని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కావాలనే జగనన్న కాలనీలను నిర్వీర్యం చేయటంతో పాటు ఆ కాలనీలను అధికార పార్టీ కార్యకర్తలు కబ్జా చేసే విధంగా చూస్తున్నారన్నారు.
2 వేల టన్నుల స్టీల్ తరలించేస్తున్నారు..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం జిల్లాకు 2 వేల టన్నుల స్టీలు కేటాయించారని, ప్రస్తుత పాలకులు అధికారులతో కుమ్మకై ్క అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆర్డర్లు లేకపోయినా హౌసింగ్ పీడీ కావాలనే అప్పటికప్పుడు ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో తరలిస్తున్నారని.. అప్పటికప్పుడు ఆర్డరు తయారుచేయడానికి ఆయనకు అధికారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు తరలిస్తున్నామని హౌసింగ్ పీడీ చెబుతున్నారని, అక్కడ గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు నిర్మించుకోవటం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలన్నారు.
జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం నిల్వ చేసిన ఇసుక, సిమెంటు, స్టీలు నిల్వలు ఏమయ్యాయో, ఎలా మాయమయ్యాయో నిగ్గు తేలుస్తామని పేర్ని నాని అన్నారు. ప్రతి బాగోతాన్ని బయటకు తీస్తామన్నారు. గుడివాడలో స్టీలు దొంగతనం జరిగిందని అధికారులు చెబుతున్నారని అవి నిజంగానే దొంగతనం జరిగిందా, లేక అమ్ముకున్నారో తేలుస్తామన్నారు. వీటన్నింటిపై తాను త్వరలో ఏసీబీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. ఒక వేళ ఏసీబీ అధికారుల విచారణను కూడా పాలకులు అడ్డుకుంటే నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, కేశన నాని, మాచవరపు రాంప్రసాద్, చీలి చక్రపాణి, బొల్లా చక్రవర్తి తదితరులు ఉన్నారు.


