మచిలీపట్నంఅర్బన్: ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, వ్యక్తిత్వ వికాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ ఇటీవల జరిగిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 56 మందిని సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, దాన్ని అర్థం చేసుకోవడం, మాట్లాడడం, రాయడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి..
ట్రైనీ కలెక్టర్ నమ్రత అగర్వాల్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యలో రాణించాలని అన్నారు. డీఈవో యూవీ సుబ్బారావు మాట్లాడుతూ కలెక్టర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులను ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించి పతకాలు, ప్రేరణాత్మక పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, డీటీడబ్ల్యూవో ఫణి ధూర్జటి, మచిలీపట్నం ఆర్డ్డీఓ సాంబశివరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


