ఉత్సాహంగా ‘ఎఫ్‌సీఐ’ క్రికెట్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘ఎఫ్‌సీఐ’ క్రికెట్‌ టోర్నమెంట్‌

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

ఉత్సాహంగా ‘ఎఫ్‌సీఐ’ క్రికెట్‌ టోర్నమెంట్‌

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) దేశానికి ఆహార భద్రతతో పాటుగా భరోసాను ఇస్తోందని ఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్‌ బ్రాంచ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. ఎఫ్‌సీఐ స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ ప్రమోషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌ ఆధ్వర్యంలో 6వ అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమం డాక్టర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ క్రికెట్‌ గ్రౌండ్స్‌ ఆవరణలో మంగళవారం జరిగింది. ఈ టోర్నమెంట్‌లో శ్రీకాకుళం, వైజాగ్‌, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, రీజినల్‌ ఆఫీస్‌ అమరావతికి చెందిన 8 టీమ్‌లు పోటీపడ్డాయి. మొదటి రోజు (సోమవారం) పోటీల అనంతరం కాకినాడ, వైజాగ్‌, విజయవాడ, అమరావతి టీమ్‌లు సెమీ ఫైనల్స్‌కి చేరాయి. మంగళవారం ఉదయం జరిగిన సెమీఫైనల్స్‌లో కాకినాడ, వైజాగ్‌ టీమ్‌లు ప్రతిభ చూపి ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మధ్యాహ్నం జరిగిన ఫైనల్స్‌లో ముందుగా కాకినాడ టీమ్‌ బ్యాటింగ్‌కు దిగి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు సాధించగా, వైజాగ్‌ టీమ్‌ 13.5 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ముగింపు వేడుకలలో ముఖ్య అతిథులుగా ఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొని విజేతలకు బహుతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటుగా ఐక్యత పెంపునకు క్రీడలు దోహదం చేస్తాయని, ఏటా ఎఫ్‌సీఐ ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement