టెన్త్ విద్యార్థుల పుస్తకాలు 9వ తరగతి పిల్లలకు ఇచ్చేశారు సప్లిమెంటరీ విద్యార్థులకు చదవడానికి పుస్తకాల్లేవు మ్యాపింగ్ పేరుతో సుదూర ప్రాంతాల్లో తరగతులు పరీక్షలకు సిద్ధమయ్యేదెలా అంటూ విద్యార్థుల ఆందోళన
మ్యాపింగ్‌తో విద్యార్థులకు ఇబ్బందులు..
విద్యా శాఖ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల పాఠ్యపుస్తకాలన్నీ తీసుకుని బ్రిడ్జి కోర్సు పేరుతో 9 నుంచి 10లోకి వస్తున్న విద్యార్థులకు ఇప్పించారు. ఈనెల 25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు అని ప్రకటించారు. తప్పిన విద్యార్థులకు పరీక్షలకు చదువుకోవడానికి వారి దగ్గర పాఠ్య పుస్తకాలు లేకుండా పోయాయి. పరీక్షలకు చదివేదెలా అంటూ వారు వాపోతున్నారు.
మచిలీపట్నంఅర్బన్: ఎస్.ఎస్.సి సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధమవ్వాల్సిన విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేక గందరగోళంలో పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రారంభించిన బ్రిడ్జ్ కోర్స్ తీవ్ర ప్రభావం ఎస్‌ఎస్‌సి ఫెయిల్ విద్యార్థులపై పడింది. 2025–26 ఏడాది పరీక్షలు పూర్తవటంతోనే 10 వ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాలు తీసుకుని ఈ ఏడాది 9వ తరగతి నుంచి 10లోకి ప్రవేశించే విద్యార్థులకు పంపిణీ చేశారు. దీంతో ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు లేవు. పుస్తకాలు తీసుకున్న విద్యార్థులు వేసవి సెలవుల కారణంగా వారి వద్ద నుంచి తిరిగి పొందే అవకాశం లేదు. మరోవైపు సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. సమయం చాలా తక్కువగా ఉండటంతో పరీక్షలకు సిద్ధం కావటానికి ఎలా చదివి పాస్ అవ్వాలన్న ఆందోళన విద్యార్థులలో తీవ్రమైంది. జిల్లాలో గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో గణనీయ సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరికి ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో పాటు ఒక ఊళ్లో విద్యార్థులను వేరే ఊళ్లో ఉన్న పాఠశాలలకు మ్యాపింగ్ చేసిన విధానం కూడా ఆటంకంగా మారింది.
లక్ష్యం నెరవేరని బ్రిడ్జ్ కోర్సు..
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ కోర్సు క్షేత్రస్థాయిలో విఫలమైంది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 23 వరకు మొత్తం 43 రోజులపాటు ఈ కోర్సును నిర్వహించి, వేసవి సెలవుల నాటికి 25 శాతం సిలబస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలు సమయంలో మెజారిటీ ఉపాధ్యాయులు పదో తరగతి పరీక్షల మూల్యాంకన విధుల్లో నిమగ్నమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం అందలేదు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు స్వయంగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్రిడ్జ్ కోర్సు లక్ష్యం పూర్తిగా దెబ్బతింది. అంతేకాక బ్రిడ్జ్ కోర్సు విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యపుస్తకాలు తిరిగి తీసుకునే అవకాశం లేక సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది.
ఫలితాల్లో బయటపడిన లోపాలు
మార్చి–2026 ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జిల్లాలో విద్యా వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గణాంకాల ప్రకారం మొత్తం 21,053 మంది పరీక్షలకు హాజరుకాగా 18,540 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో మొత్తం 2,513 మంది ఫెయిల్ అవగా అందులో గణితంలో 1,252 మంది, సైన్స్ 1,431 మంది, సోషల్ 770 మంది ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా సైన్స్, గణితం వంటి కీలక సబ్జెక్టుల్లో అధిక సంఖ్యలో ఫెయిల్ నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
మండలాల వారీగా...
మండలాల వారీగా మచిలీపట్నంలో 192 మంది గణితం, 220 మంది సైన్స్ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. గుడివాడలో 115 మంది గణితం, 135 మంది సైన్స్‌లో, పెనమలూరులో 140 మంది గణితం, 155 మంది సైన్స్‌లో ఫెయిల్ అయ్యారు. గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు వంటి మండలాల్లో కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ముఖ్య సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం గమనార్హం.
పదో తరగతిలో తప్పిన విద్యార్థులకు అదే పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దూర ప్రాంతాల పాఠశాలలకు మ్యాపింగ్ చేయడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి రావడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. మొవ్వ మండలం కాజ హైస్కూల్‌లో తప్పిన విద్యార్థులను నిడుమోలు హైస్కూల్‌కు, మొవ్వ హైస్కూల్ విద్యార్థులను చిన్నముత్తేవి హైస్కూల్‌కు, కూచిపూడి విద్యార్థులను భట్లపెనుమర్రుకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మ్యాపింగ్ విధానం వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


