11 ఏళ్లకే పెళ్లి.. 12 ఏళ్లకు తల్లి | - | Sakshi
Sakshi News home page

11 ఏళ్లకే పెళ్లి.. 12 ఏళ్లకు తల్లి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

11 ఏళ్లకే పెళ్లి.. 12 ఏళ్లకు తల్లి కిశోర బాలికల సాధికారతకు వేసవి శిబిరాలు దేశద్రోహం కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు వాటర్‌ ట్యాంక్‌ మీద పడి బాలుడు మృతి

హై రిస్క్‌ ప్రెగ్నెన్సీ.. ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికకు వివాహం జరిపించారు. ఆ బాలిక పెళ్లయిన ఏడాదిలోనే గర్భం దాల్చింది. 12వ ఏట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు విజయవాడ నగరంలోనే జరి గింది. విజయవాడకు చెందిన 11 ఏళ్ల బాలికకు, గన్నవరం ప్రాంతానికి చెందిన యువకుడితో ఏడాది క్రితం పెళ్లి చేశారు. బాల్య వివాహాలను అరికడుతున్నామని చెబుతున్న మాతా శిశు సంక్షేమ శాఖ, అంగన్‌వాడీ కేంద్రాలు, బాలికల సంరక్షణ కోసం పని చేస్తున్న సంస్థలు, పోలీసుల కళ్లు గప్పి ఏడాది క్రితం ఈ బాల్య వివాహం చేయించారు. ఆ బాలిక గర్భం దాల్చింది. డెలివరీ సమయంలో హైరిస్క్‌ కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆస్పత్రిలో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా బాల్య వివాహాలను అరికట్టి.. బాలికలను రక్షించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కిశోర బాలికల సాధికారతకు వేసవి శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కిశోర బాలికల వేసవి శిబిరాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కిశోర బాలికల సమగ్రాభివృద్ధి కోసం మే ఒకటి నుంచి ప్రారంభం కాగా దీనికి సంబంధించిన ప్రచార వాల్‌ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. జూన్‌ 11 వరకు కార్యక్రమం నిర్వహించాలన్నారు. బాలికలు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్యమేళా, రక్తహీనత నివారణ తదితర అంశాలపై శిబిరాల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమం అమలులో మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య, పోలీస్‌శాఖలు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ పీడీ ఎంఎన్‌ రాణి, జిల్లా బాలల సంరక్షణాధికారి బి.కిషోర్‌, నోడల్‌ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ లీగల్‌: ఇటీవల దేశద్రోహం కేసులో అరైస్టెన 11 మందికి ఈనెల 18 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులను వర్చువల్‌గా విజయవాడ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బి.రాధారాణి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్‌ను మరోసారి పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

పెనమలూరు: కానూరులో బాలుడిపై ప్రమాదవశాత్తు వాటర్‌ ట్యాంక్‌ పడటంతో మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తట్టికోట ధనలక్ష్మి భర్త సాయి తాడేపల్లిలో ఉంటారు. వారికి దేవాన్ష్‌ (3) కుమారుడు ఉన్నాడు. ధనలక్ష్మి 7 నెలల గర్భిణి. ఆమె కానూరు తులసీనగర్‌లో ఉన్న పుట్టింటికి ఇటీవల వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రేకుల షెడ్డులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటి పనులు చేయడం కోసం కుమారుడిని రేకుల షెడ్డులో పడుకోబెట్టింది. అయితే రేకుల షెడ్డు పై ఉన్న మంచినీటి ట్యాంక్‌ ఒక్కసారిగాపై నుంచి నిద్రిస్తున్న బాలుడి పై పడింది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఘటన పై తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement