జ్ఞాన భారతం ప్రాజెక్టులో డిజిటలైజేషన్ ఠాగూర్ గ్రంథాలయంలో ప్రక్రియ ప్రారంభం
తాళ పత్ర గ్రంథాలు అనగానే ఒక మతపరమైనవి అన్న అపోహ వీడాలి. వందల ఏళ్ల నాడు ప్రతీది తాళపత్ర, తామ్ర పత్ర గ్రంథాల్లోనే లభించేది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముందుగా ఈ మాన్యుస్క్రిప్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేస్తున్నాం. ఠాగూర్ గ్రంథాలయంలో రామాయణంలోని యుద్ధకాండ, ఉత్తర కాండకు సంబంధించినవి ఉన్నాయి. ఆయుర్వేదానికి సంబంధించిన తాళపత్రాలు లభ్యమయ్యాయి. వీటన్నింటిని స్కాన్ చేసి జ్ఞాన భారతం మిషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఎవరి వద్దనైనా తాళ పత్ర గ్రంథాలు ఉంటే వాటిని డిజిటలైజేషన్ చేసిన తర్వాత తిరిగి అప్పగిస్తాం.
–డాక్టర్ ఇందిర మలపాక, డైరెక్టర్,
మాన్యుస్క్రిప్ట్స్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏఐ, డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్‌తో కావాల్సిన సమాచారం మన ముందుంటుంది. వందల ఏళ్ల నాడు కాగితం, కలం లేని రోజుల్లో జ్ఞానమంతా తాళ పత్ర, తామ్ర పత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ఇతిహాసాలు, సకల శాస్త్రాలు, రోజువారీ వ్యవహారాలను తాళ పత్ర గ్రంథాల్లో భద్రపరిచేవారు. అయితే తాళపత్ర గ్రంథాలు.. విశిష్టత.. అవి అందించిన జ్ఞాన సంపద నేటి తరానికి తెలీదు. ఎలక్ట్రానిక్ యుగం మొదలైనా. నేటికీ కొన్ని మ్యూజియాలు, గ్రంథాలయాల్లో, కళాశాలల్లో, పరిశోధనాలయాల్లో అక్కడక్కడ తాళ పత్రాలు గ్రంథాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని పూర్తిగా శిథిలం కాగా... మరికొన్ని పాక్షికంగా పాడయ్యాయి. తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన జ్ఞానాన్ని, ఆ వారసత్వ సంపదను భావితరాలకు అందించడానికి నడుం కట్టింది ‘జ్ఞాన భారతం’ మిషన్.
ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే
జ్ఞానభారత్ మిషన్‌లో భాగంగా మాన్యుస్క్రిప్ట్స్ అయిన తాళపత్రాలు, తామ్ర పత్రాలను డిజిటలైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సర్వే, క్యాటగైరేజషన్, ప్రిజర్వేషన్, డిజిటలైజేషన్ చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని గ్రంథాలయాల్లో ప్రారంభమైంది. ఠాగూర్ గ్రంథాలయంలో రామాయణం 2, చిత్తరంజన్ గ్రంథాలయంలో ఆయుర్వేదానికి ఒకటి తాళ పత్ర గ్రంథాలు ఉన్నట్లు గుర్తించారు. పీబీ సిద్ధార్థ కళాశాలలో 5 తాళ పత్రాలు, ఆర్కియాలాజికల్ మ్యూజియం, ఓరియంటల్ లైబ్రరీలో వివిధ రకాలైన మాన్యుస్క్రిప్ట్‌లను గుర్తించారు. వీటిని డిజిటలైజేషన్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించారు. చెద, దుమ్ము , ధూళి దులిపి వేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న వాటికి స్పిరిట్ పూస్తున్నారు. వాటి జీవిత కాలం పెంచేందుకు నిమ్మగడ్డి రసం రాస్తున్నారు. ఈ ప్రక్రియ తర్వాత వాటిని స్కాన్ చేసి .. మొత్తం డిజిటలైజ్ చేస్తారు. ఇప్పటికే దాదాపుగా ఈ ప్రక్రియ ముగియవచ్చింది.


