మరిన్ని విజయాలు అందుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మరిన్ని విజయాలు అందుకోవాలి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

కలెక్టర్‌ లక్ష్మీశ పదిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సత్కారం భవిష్యత్తుకు ప్రేరణగా ‘లంచ్‌ విత్‌ కలెక్టర్‌’

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు మరిన్ని విజయాలు అందుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి టెన్త్‌ ఫలితాల్లో 580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సోమవారం సత్కరించారు. ఈ కార్యక్రమం నగరంలోని సాయి జువెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్‌కు లంచ్‌ విత్‌ కలెక్టర్‌ కార్యక్రమం జరిగింది. విద్యార్థులను పతకాలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ అందరి చొరవ ఫలితంగా ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించామన్నారు. 72 శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘పది’ పరీక్షల్లో మరింత ఉన్నత విజయాలు సొంతం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడానికి సత్కారంతో పాటు లంచ్‌ విత్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

మహమ్మద్‌ ఎ.ఫర్హీన్‌ 595 మార్కులు, కె.నాగదుర్గారాణి 593, జి.నిత్య సాత్విక 591 మార్కులతో ఇలా ఎందరో విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మనసుస్న మార్గదర్శులు ‘పీ4’ ద్వారా ముందుకు రావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎల్‌.చంద్రకళ, డెప్యూటీ డీఈవోలు సాంబశివరావు, గుర్నాథం, శ్యాంసుందర్‌, మార్గదర్శి యు.నిరుపమ బలరాం, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement