పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని ఎన్టీఆర్ జిలా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాస్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ పారదర్శకత పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి వ్యవహరించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
మొత్తం 98 అర్జీలు
పీజీఆర్‌ఎస్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించి 98 అర్జీలు అందాయన్నారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 29 అర్జీలు, రెవెన్యూ 21 దరఖాస్తులు, పోలీసు శాఖ 12, పంచాయతీరాజ్‌కు 9 అర్జీలు వచ్చాయి. డీఆర్‌డీఏకు 8, పౌర సరఫరాలు, ఏపీఎస్ ఆర్‌టీసీలకు మూడు చొప్పున, విద్య, విద్యుత్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, రవాణా, బీసీ సంక్షేమం, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ, కార్మిక, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ అండ్ బీ శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున అందాయన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


