అప్‌గ్రేడ్‌తో సరి! | - | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడ్‌తో సరి!

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

జి.కొండూరు పరిధిలో మూడు పాఠశాలలు మౌలిక వసతులు అప్‌డేట్‌ కాలేదు భవన నిర్మాణాలను మధ్యలోనే ఆపేసిన పాలకులు వచ్చే విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ కష్టమే!

తరగతుల నిర్వహణకు

ఢోకా లేదు

అప్‌గ్రేడ్‌ అయిన ఐదు హైస్కూళ్లలో తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేదు. కొద్దిపాటి పనులను పూర్తి చేసి కట్టుబడిపాలెం హైస్కూలు భవనాన్ని త్వరలో వినియోగంలోకి తెస్తాం. చెర్వుమాధవరం హైస్కూలు భవనంలో రెండు అదనపు గదుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తాం. చెవుటూరు హైస్కూలుకు ఆట స్థలం కోసం స్థలం సర్వే చేస్తున్నాం. వెల్లటూరు హైస్కూల్‌ భవనం, ఆట స్థలం కోసం రెండు ఎకరాలను గుర్తించాం. భవనాలు అందుబాటులోకి వచ్చే వరకు తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

–ఎం.వీరాస్వామి,

మండల విద్యాశాఖ అధికారి–2, జి.కొండూరు

జి.కొండూరు: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. నాడు–నేడు పేరుతో గత వైఎస్సార్‌ సీపీ గవర్నరమెంట్‌.. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణం వంటి ఎన్నో చర్యలను చేపట్టింది. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భవనాలను నిలిపివేసి వివక్షను చాటింది. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025–26 విద్యా సంవత్సరంలో చెర్వుమాధవరం, వెల్లటూరు, కుంటముక్కల ప్రాథమికోన్నత పాఠశాలలను జెడ్పీ హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేశారు. చెర్వుమాధవరం పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలోనే నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి రూ.60 లక్షలతో ఐదు అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. మూడు గదుల నిర్మాణం పూర్తైన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాన్ని ఆపేసింది. ఇక్కడ భవనం లేక ఇరుకు గదుల్లోనే ఈ ఏడాది తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఇటీవల అప్‌గ్రేడ్‌ అయిన వెల్లటూరు, కుంటముక్కల హైస్కూళ్లకు ప్రత్యేక భవనాలు లేకపోవడంతో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు స్కూళ్లకు ఆట స్థలాలు లేవు. విద్యార్థులు పెరిగితే తరగతి గదులు లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది.

అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఐదు శాతం పూర్తి చేయలేదు

జి.కొండూరు మండల పరిధిలో గంగినేని, జి.కొండూరు, వెలగలేరు, కవులూరు, కోడూరు హైస్కూళ్లు గతం నుంచి కొనసాగుతుండగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2017లో కట్టుబడిపాలెం, చెవుటూరు ప్రాథమికోన్నత పాఠశాలలను జెడ్‌పీ హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ క్రమంలో కట్టుబడిపాలెం హైస్కూలు భవన నిర్మాణానికి నాడు–నేడు నిధులు 1.92కోట్ల కేటాయించారు. ఈ భవన నిర్మాణం అప్పట్లోనే ప్రారంభమై 95శాతం పూర్తైంది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఐదు శాతం పనులను పూర్తి చేయలేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీనితో ప్రాథమిక పాఠశాల భవనంలోనే చాలీ చాలని గదుల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. చెవుటూరు హైస్కూలు భవన నిర్మాణానికి అప్పట్లోనే ప్రయత్నాలు చేసినప్పటికీ స్థలం సమస్యతో పనులను ప్రారంభించలేదు.

విద్యార్థులు పెరిగితే ఇక్కట్లే..

జి.కొండూరు మండల పరిధిలో 2025–26 విద్యా సంవత్సరంలో కుంటముక్కల హైస్కూల్లో 148 మంది, వెలగలేరు హైస్కూల్లో 289 మంది, కోడూరు హైస్కూల్లో 134 మంది, కట్టుబడిపాలెం హైస్కూల్లో 112 మంది, జి.కొండూరు హైస్కూల్లో 307 మంది, వెల్లటూరు హైస్కూల్లో 141 మంది, గంగినేనిపాలెం హైస్కూల్లో 155 మంది, కవులూరు హైస్కూల్లో 169 మంది, చెర్వుమాధవరం హైస్కూల్లో 134 మంది, చెవుటూరు హైస్కూల్లో 121మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ ఏడాది విద్యార్థులు సంఖ్య పెరిగితే నూతనంగా అప్‌గ్రేడ్‌ అయిన ఐదు పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుంది.

రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోని కట్టుబడిపాలెం హైస్కూలు భవనం మధ్యలోనే ఆగిపోయిన చెర్వుమాధవరం హైస్కూలు భవనం

Advertisement
 
Advertisement
Advertisement