సంకీర్తనలతో భక్తిభావం
విజయవాడకల్చరల్: అన్నమాచార్యుని 618 జయంతి సందర్భంగా అన్నమయ్య సంకీర్తన అకాడమీ (శ్వాస) లబ్బీపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యాన ఆదివారం అన్నమయ్య సంకీర్తన యజ్ఞం 12 గంటలపాటు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాల, యువ, సంగీత కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తి భావాన్ని పంచాయి. పరాశరం వరేణ్య, లలితా శ్రీవల్లి, కె.వైష్ణవి, పోపూరి షణ్ముఖ ప్రియ, నాగనందిని, సీహెచ్ హరిత, అనూరాధ, ద్దాదశి అనూష, గురుచరణ సంగీత మండలి శిష్య బృందం, తదితరులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. సంస్థ బాధ్యులు సత్యబాలు, ప్రసాద్ నిర్వహించారు. దేవాలయం ఇన్ చార్జి ఆర్.రామ్మోహనరావు, మేనేజర్ శర్మ పాల్గొన్నారు.
● సీతారామ కల్యాణ మండపంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ముఖ్యఅతిథి డేవిడ్‌రాజు మాట్లాడుతూ అన్నమయ్య పదాలు తెలుగు భాషా వీచికలు అని అభివర్ణించారు. గాయకులు పప్పు సదాశివశాస్త్రి, పీవీఎస్ మూర్తి, వడ్డాది కామేశ్వరి, బి.కామేశ్వరిని నిర్వాహకుడు చింతకాయల చిట్టిబాబు ఆత్మీయంగా సత్కరించారు.
నవ్వు దివ్య ఔషధం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మనిషి ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు దివ్య ఔషధమని లాఫ్టర్ యోగా క్లబ్ ఫౌండర్ చైర్మన్ తొండెపు వెంకట హనుమంతరావు చెప్పారు. స్థానిక ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని విజయవాడ వాకర్స్ అసోసియేషన్ హాలు వద్ద ప్రపంచ నవ్వుల దినోత్సవం ఆదివారం జరిగింది. హనుమంతరావు మాట్లాడుతూ నవ్వు నవ్వించు, ఆనందంగా జీవించు అనే నినాదంతో స్టేడియంలో నడకయాత్ర చేశారు. లాఫింగ్ యోగా జాతీయ వ్యవస్థాపకులు మదన్ కొఠారియా పంపిన సందేశాన్ని చదివారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రావి కృష్ణారావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకరరావు, బి.సంజీవరావు, పీవీఎస్‌ఎన్ శర్మ, బి.రాంబాబు, చుక్కపల్లి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వీరులపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనలో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిమన్యు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు మండలంలోని జయంతి గ్రామానికి చెందిన గల్లా పుల్లారావు శుభకార్యాల్లో వినియోగించే మేళతాళాల వాయిద్యకారుడిగా పని చేస్తుంటాడు. వృత్తిలో భాగంగా శనివారం ఉదయం పెద్దాపురం గ్రామంలోని శుభకార్యంలో పాల్గొని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అతపిరి అలసటగా, గుండెలో నొప్పిగా ఉందని భార్యకు తెలపగా హుటాహుటిన నందిగామలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. మృతుని భార్య దుర్గ ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


