వర్షంతో నిలిచిన బండలాగుడు పోటీలు | - | Sakshi
Sakshi News home page

వర్షంతో నిలిచిన బండలాగుడు పోటీలు

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

నందిగామ రూరల్‌: మండలంలోని లింగాలపాడు గ్రామంలో లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు ఆదివారం నిలిచిపోయాయి. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో నాలుగు పళ్ల విభాగం పోటీలను నిలిపివేసినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం వర్ష ప్రభావం లేకపోతే పోటీలు యథావిధిగా సాగుతాయని చెప్పారు.

రెండు పళ్ల విభాగంలో విజేతలు

గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన రెండు పళ్ల విభాగం.. ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో తొమ్మిది జతలు పాల్గొన్నాయని రైతు కమిటీ సభ్యులు తెలిపారు. పది నిముషాల వ్యవధిలో ఎనిమిది క్వింటాళ్ల బరువును 3,648 అడుగుల దూరం లాగి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన బెల్లం రిత్విక్‌ చౌదరి, యువరాజ్‌ చూదరి, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన యర్రం రాజశేఖర్‌, యశ్వంత్‌ ఎడ్ల జతలు ప్రథమ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం కావూరిలింగంగుంట్లకు చెందిన మైలం త్రివేణి నాయుడు ఎడ్ల జత మూడు వేల అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలవగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరానికి చెందిన పయ్యావుల ఝాన్సీలక్ష్మి, బాలనాగరాజు, యలం వెంకటరావు ఎడ్ల జత 2,906.7 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేలం పద్మనాయుడు ఎడ్ల జత 2,500 అడుగుల దూరం లాగి నాలగవ స్థానంలో నిలిచింది. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.25 వేలు, 20 వేలు,18 వేలు,15 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ కమిటీ చైర్మన్‌ చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్దశ్రీను, ఉమ్మనేని విక్రం, అత్తలూరి వెంకట్రావు, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరుమామిళ్ల రాంబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement