విద్యుదాఘాతంతో పెయింటర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో పెయింటర్‌ మృతి

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

పెనమలూరు: కానూరులో విద్యుదాఘాతంతో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం కానూరు సనత్‌నగర్‌కు చెందిన పటాన్‌ఫిరోజ్‌ఖాన్‌ (38)కి భార్య షబీనా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిరోజ్‌ఖాన్‌ పెయింటర్‌. ఈ నెల 1వ తేదీ అతను కానూరు మురళీనగర్‌లో ద్వారకా నిలయం అపార్టుమెంట్‌ వద్ద పెయింటింగ్‌ పనులకు వచ్చాడు. అతను భవనం పైకి ఎక్కి తాడుతో దిగుతూ పెయింటింగ్‌ పనులు చేయసాగాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కింద ఉన్న విద్యుత్‌ తీగలకు తగిలాడు. అతను విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను శనివారం మృతి చెందాడు. ఘటన పై షబీనా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బంగారు గొలుసు కోసం.. వృద్ధురాలిపై హత్యాయత్నం

పామర్రు: పమిడిముక్కల మండలం ధూళిపూడిపాలెంలో వృద్ధురాలికి ఉన్న బంగారు నగ కోసం స్థానికుడు హత్యాయత్నం చేసిన సంఘటనపై ఆదివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ధూళిపూడి పాలెంకు చెందిన మైనేని సీతామహాలక్ష్మి వృద్ధురాలు. వేసవి కాలం కావడంతో ఇంటి వరండాలో శనివారం రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అదే గ్రామానికి చెందిన ధూళిపూడి గురవయ్య అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి నిద్ర పోతున్న సీతామహాలక్ష్మి మెడలో ఉన్న బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన దుండగుడు తనతో పాటు తెచ్చిన కొడవలితో ఆమె తలపై, చేతిపై గట్టిగా నరికాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో గురవయ్య పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత మహిళను విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. స్థానికుల ఫిర్యాదుపై గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పమిడిముక్కల మండలం ఎస్‌ఐ బి.శ్రీను తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పద్మావతి ఘాట్‌ సమీపంలో రైల్వేట్రాక్‌ కింద కృష్ణానదిలో ఒక వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు ఆదివారం ఉదయం 9 గంటలకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని, ఊరు, పేరుకు సంబంధించి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూకలర్‌ ఫుల్‌ అండర్‌వేర్‌, రెడ్‌ కలర్‌ మొలతాడు ధరించి ఉన్నాడని చెప్పారు. నదిలోకి స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94921 48188, 98498 08555 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement