దళిత హక్కుల పోరాట సమితి మహాసభ తీర్మానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు అంశాన్ని సుప్రీం కోర్టు పునఃపరిశీలించాలని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో డీహెచ్‌పీఎస్ 3వ మహాసభ జరి గింది. తొలుత డీహెచ్‌పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని మహాసభలో ఏకగీవ్రంగా తీర్మానించింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ వివక్ష, అవమానాలకు గురైన ఎస్సీ, ఎస్టీలు సామాజిక న్యాయం పొందడానికి ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమానత్వానికి పోరాడాల్సి వస్తోందన్నారు దళితుల హక్కుల సాధన కోసం భారీ ఉద్యమానికి డీహెచ్‌పీఎస్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు కులానికి, మతానికి ముడిపెట్టి దళిత క్రై స్తవులకు ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాది సుబ్బారావు, జేవీ ప్రభాకర్, తెలంగాణ డీహెచ్‌పీఎస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


