టాస్క్‌ఫోర్స్(విజయవాడ): నగరంలో అధికార పార్టీకి చెందిన వారు విలువైన స్థలాలపై కన్నేసి లబ్ధి పొందే విష సంస్కృతికి పాల్పడుతున్నారు. ఆర్‌ఎస్ నంబరు 785/3 దాఖలా నున్న రోడ్డులో డీమార్ట్‌కు పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలం ఉంది. దీనిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. స్థలంలో ప్రస్తుతం ఓ వర్గంవారు పొజిషన్‌లో ఉన్నారు. దీనిపై పూర్తి హక్కులు మద్దాలి వివేకానందకు వర్తిస్తాయని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన వర్గీయులు శనివారం నున్న పీఎస్‌లో చూపించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. అదే సమయంలో సెంట్రల్ నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత తన అనుచరులను స్థలం వద్దకు పంపారు. కొన్నేళ్లుగా పొజిషన్‌లో ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాల వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కొంతసేపటికి తిరిగి పంపేశారు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేత తన మనుషులతో ఎండనుంచి రక్షణ కోసం కూలర్లు ఏర్పాటు చేసుకుని మరీ స్థలంలో తిష్ట వేశారు.
ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేత ఈ విషయంలో ఆసక్తి చూపడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.


