హనుమాన్‌జంక్షన్ రూరల్: స్థానికంగా సంచలనం సృష్టించిన చిన్ని ఎంటర్‌ప్రైజస్, కేకే హెచ్–మార్ట్‌ల యాజమాని వడ్డి క్రాంతికిరణ్ హత్య కేసులో నిందితుడు రామి నేని వెంకట శివరామకృష్ణను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఎల్.రమేష్ మీడియాకు వివరించారు. ఆయన కథనం మేరకు.. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి కేకే హెచ్–మార్ట్‌కు తాళాలు వేసి స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న వడ్డి క్రాంతికిరణ్‌ను పాత కక్షల నేపథ్యంలో రామినేని వెంకట శివరామకృష్ణ పక్కా పథకం ప్రకారం కాపుకాసి కారుతో ఢీకొట్టి హతమార్చాడు. గతంలో రామినేని వెంకట శివరామకృష్ణ చెల్లి కేకే హెచ్–మార్ట్‌లో పని చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ ఘటనపై ఏలూరు జిల్లా పెదపాడు పోలీస్‌స్టేషన్‌లో వడ్డి క్రాంతికిరణ్‌పై కేసు కూడా నమోదైంది. తన చెల్లెలు మరణానికి క్రాంతికిరణే కారణమని భావించిన రామినేని వెంకట శివరామకృష్ణ హత్యకు పథకరచన చేశాడు. పాత కక్షల నేపథ్యంలోనే వడ్డి క్రాంతికిరణ్‌ను హత్య చేసినట్లుగా విచారణలో నిందితుడు వెంకట శివరామకృష్ణ వెల్లడించాడని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి నూజివీడు కోర్టుకు తరలించారు.


