ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో 400 దుకాణాలు తొలగింపు పేదల ఉపాధిపై దెబ్బకొట్టిన అధికారులపై పేదల కన్నెర్ర ప్రత్యామ్నాయ స్థలం చూపాలంటున్న చిరు వ్యాపారులు
40 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం
ఇబ్రహీంపట్నం: స్థానిక రింగ్‌సెంటర్‌లో చిరు వ్యాపారులపై కొండపల్లి మునిసిపాలిటీ అధికా రులు కొరడా ఝుళిపించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు వందల మంది పోలీసులతో మునిసిపల్ అధికారులు రింగ్ వద్దకు పొక్లెయిన్లతో చేరుకుని ఫుట్‌పాత్‌లపై ఉన్న దుకాణాలను తొలగించారు. 400 మంది చిరు వ్యాపారులు రోడ్ల పక్కన సీజనల్ పండ్లు, ఫ్యాన్సీ సరుకులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. రింగ్ సెంటర్‌ను యాక్సి డెంట్లు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు. ఆ ప్రభావం చిరువ్యాపారులపై పడింది. పోలీసులు, మునిసిపల్ సిబ్బంది వందలాదిగా తరి వచ్చి దుకాణాల తొలగింపు చేపట్టడంతో చిరువ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఎందరికో ఉపాధి అవకాశాలు
రెక్కాడితేగాని డొక్కాడని చిరువ్యాపారులు 50 ఏళ్లుగా రింగ్ సెంటర్ ప్రాంతాన్ని నమ్ముకుని బతుకీడుస్తున్నారు. పాత ఆర్‌అండ్‌బీ రోడ్డు ఉన్నప్పటి నుంచి, 2003లో నాలుగు లైన్ల జాతీయ రహదారిగా మారినప్పటికీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చిరువ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలపై వచ్చే ఆదాయంతోనే తమ బిడ్డలను చదివించుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా దుకాణాలు శాశ్వతంగా తొలగించడంతో వారు తల్లడిల్లుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు అభివృద్ధి చేసిన స్థలాన్ని నామమాత్రపు అద్దెకు కేటాయించాలని కోరారు.
యాక్సిడెంట్ స్పాట్‌గా ఉన్నందునే..
గత నెలలో కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమా దాలకు గల కారణాలపై సర్వే నిర్వహించారు. ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించి. ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రింగ్ వద్ద రోడ్డు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చిరువ్యాపారులను తొలగించామని మునిసిపల్, పోలీస్ అధికారులు తెలి పారు. రోడ్డును వెడల్పు చేయడం ద్వారా రింగ్ సెంటర్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగదని వారు భావిస్తున్నారు. దుకాణాలను కోల్పోయిన చిరు వ్యాపారులకు సీఐటీయూ మద్దతు తెలిపింది. దుకాణాలను తొలగించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకపోతే ఈ నెల ఐదో తేదీన ధర్నా చేస్తామని హెచ్చరించారు.
సీజనల్‌గా వచ్చే పండ్లు, పూలు, ఇతర వస్తువులతో 40 ఏళ్లుగా చిరువ్యాపారం చేస్తున్నా. 18 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. ఈ వ్యాపారంపైనే నలుగురు బిడ్డలను చదివించి వివాహాలు చేశాను. బిడ్డలు పొరుగూరుల్లో బతుకుతున్నారు. వ్యాపారం లేకుంటే నాకు జీవనం కష్టం. ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలని కోరుతున్నా.
– ఇంజిమూడి కుమారి, చిరువ్యాపారి


