తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలి

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అవినాష్‌

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న, తొలగించిన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. అవినాష్‌ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ శనివారం పటమటలోని ఎన్‌ఎస్‌ఎం స్కూల్‌ నుంచి వీఎంసీ సర్కిల్‌–3 కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్కిల్‌–3 జోనల్‌ కమిషనర్‌ షమ్మీకి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందని, దీనిపై జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనధికారిక గెజిట్‌ పత్రికయిన ఈనాడులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని, దీనికి పాలకులు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లు తొలగిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఏమి చేస్తున్నారని నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో ఏమీ జరగకపోయిన గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు కళ్లు కనపడటం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అర్హులు అందరికీ పింఛన్లు మంజూరు చేయగా, కూటమి హయాంలో అన్ని రకాల ఫించన్లు తొలగించారని విమర్శించారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లపై ప్రభుత్వం మాట తప్పిందన్నారు. పింఛన్లు అందక దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు మాట్లా డుతూ.. విజయవాడలో తొలగించిన ఫించన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నవ రత్నాలను అమలు చేసి, వాస్తవాలు చెప్పే వారని, రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల నూతన పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఆళ్ల చెల్లారావు, సర్నాల తిరుపతి రావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement