వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఈ నెల మూడో తేదీన జరిగే జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) –2026 నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) సమావేశ మంది రంలో నీట్–2026 ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమతమ విధులపై పూర్తిస్థాయిలో అవగాహనతో అప్రమత్తతతో ఉండాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నీట్ సిటీ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం.గోపీ కృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ ఫోటో ఐడీ వంటివి తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో 32 కేంద్రాల్లో 12 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు తప్పనిసరిగా ధ్రువీకరణ, బయోమెట్రిక్ హాజరు, ప్రిస్కింగ్ ప్రక్రియలు ఒకే ప్రవేశ ద్వారం ద్వారా జరుగుతాయని వివరించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టంచేశారు.


