ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాలలో 2570వ బుద్ధ జయంతి వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంతే ధమ్మ ధజ థెరో ఆధ్వర్యంలో అమరావతి బుద్ధ విహార్‌లో ఏర్పాటు చేసిన అమరావతి సంకల్ప సిద్ధి బౌద్ధ స్థూపంలోని ధ్యాన బుద్ధ విగ్రహాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ ప్రారంభించారు. బుద్ధుని ప్రతిమతో ర్యాలీగా వెళ్లి స్థూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధ జయంతి సభావేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ బుద్ధజయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఘంటసాలలోని బౌద్ధ స్థూపానికి మాత్రమే మహాచైత్యంగా గుర్తింపు ఉందన్నారు. దీంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శయన బుద్ధ ప్రాజెక్టుకు దాత గొర్రెపాటి రంగనాథబాబు స్థలాన్ని అందించగా వందలాదిమంది సమక్షంలో ప్రారంభమైన ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో కొనియాడబడుతున్న బౌద్ధానికి మన ప్రాంతంలో ఆదరణ లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన ధమ్మపథం పుస్తకాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను దుశ్శాలువాతో సత్కరించి, బహుమతులు అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, ఎంపీడీవో డి.సుబ్బారావు, తహసీల్దార్‌ బి.విజయ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement