అకాల వర్షం...అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం...అపార నష్టం

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

అకాల వర్షం...అపార నష్టం జి.కొండూరు: రబీ వరి సాగు చేసిన రైతులు నరక యాతన పడుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 36,934 హెక్టార్లలో రబీ వరి సాగు చేయగా 3,33,692 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అంచనాగా ఉంది. అయితే ఇప్పటికి 60 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోతలు పూర్తయిన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేయడంతో కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. జిల్లాలో జి. కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, మైలవరం, కంచికచర్ల, విజయవాడ రూరల్‌, విస్సన్నపేట మండలాల పరిధిలో పెనుగాలులతో కూడిన వర్షం కురవడంతో ధాన్యంపై కప్పిన పట్టాలు కూడా లేచిపోయి తడిసిపోయింది. అంతేకాక ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు ధాన్యం నింపేందుకు బస్తాలు ఇవ్వకపోగా సొంత ఖర్చుతో బస్తాలు కొనుగోలు చేసి ధాన్యం నింపినప్పటికీ బస్తాలను మిల్లులకు తరలించేందుకు వాహనాలను కూడా ప్రభుత్వం కేటాయించకపోవడంతో కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యంతో పాటు బస్తాల్లో నింపిన ధాన్యం సైతం వర్షానికి తడిసిపోయింది. అన్ని ఖర్చులు భరించి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే క్వింటాకి ఐదు కేజీలు చొప్పున కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. నేలరాలిన మామిడి... జిల్లాలో 22,896 హెక్టార్లలో మామిడి సాగువుతుండగా ఈ ఏడాది పూత సక్రమంగా రాక, చీడపీడలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు గురువారం కురిసిన వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎకరానికి ఈ ఏడాది 2 టన్నులకు మించి దిగుబడి వచ్చే అవకాశం లేని తరుణంలో అకాల వర్షంతో జి.కొండూరు, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్‌, ఇబ్రహీంపట్నం, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాల పరిధిలో 10 శాతంకు పైగా కాయలు నేలరాలాయి. పెనుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో చెట్లపై ఉన్న కాయలు కూడా మచ్చ వచ్చి నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. జి.కొండూరు మండల పరిధిలోని 35 ఎకరాల్లో మునగ తోటలు కూడా నేలవాలాయి. ఏఓను చుట్టుముట్టిన రైతులు... ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని రెడ్డిగూడెం మండల పరిధి రెడ్డికుంట గ్రామంలో వ్యవసాయాధికారి టిప్పు సుల్తాన్‌ను శుక్రవారం రైతులు చుట్టుముట్టారు. ధాన్యం కల్లాల్లో ఆరబోసి ఇరవై రోజులు గడిచినా బస్తాలు ఇవ్వడం లేదని, బస్తాలు సొంతంగా తెచ్చుకుని నింపినా లారీలను కేటాయించడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని ఏఓ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

వాన దెబ్బకి తీవ్ర నష్టం

ఈ ఏడాది అంతంతమాత్రంగానే మామిడి కాపు వచ్చింది. అసలే నాణ్యత లేక దిగుబడి లేక నష్టపోతుంటే వడగళ్ల వాన పడడంతో తీవ్ర నష్టం జరిగింది. మామిడి కాయలు రాలిపోగా చెట్లపై ఉన్న కాయలకు కూడా మంగు వచ్చే అవకాశం ఉంది. మూడేళ్లుగా మామిడి సాగులో నష్టాలు తప్ప ఏమీ మిగలడం లేదు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం

కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

కల్లాల్లోనే నిల్వ ఉండిపోయి

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

ప్రభుత్వ కొనుగోళ్లు లేక వర్షం

పాలైన మొక్కజొన్న

పెనుగాలులకు భారీగా

నేలరాలిన మామిడి కాయలు

ప్రభుత్వ భరోసా లేక

లబోదిబోమంటున్న రైతులు

–ఇరుగుల మురళీరెడ్డి,

మామిడి రైతు, మునగపాడు

Advertisement
 
Advertisement
Advertisement