● ఉన్నత విద్యా మండలి
వైస్ చైర్మన్ విజయభాస్కరరావు
● కేయూలో సాఫల్య దినోత్సవం
● తల్లిదండ్రుల చేతుల మీదుగా
విద్యార్థులకు నియామక
పత్రాలు అందజేత
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో అచీవర్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించిన ఇంజినీరింగ్, ఫార్మసీ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కృష్ణా యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు 100 శాతం ఉద్యోగ అవకాశాలు సాధించిన క్రమంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌ను అంచనా వేస్తూ తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం లేకుండా బయటకు వెళితే ఎదుర్కొనే కష్టాలను వివరించారు. మరో అతిథిగా విచ్చేసిన బెల్ కంపెనీ డెప్యూటీ జనరల్ మేనేజర్ బి.వి. నాగరాజు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులకు, తాను ఉద్యోగం సాధించిన నాటి పరిస్థితులను బేరీజు వేసి నేటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశం దాని ఆవశ్యకతను విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. ఉపకులపతి ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ విద్యార్థులకు డిగ్రీ కన్నా ముఖ్యం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భావ వ్యక్తీకరణ అని అన్నారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వారాల పాటు ఇంజినీరింగ్, ఫార్మసీ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల నిమిత్తం శిక్షణ ఇచ్చామని, తత్ఫలితంగానే నూరు శాతం ఉద్యోగ అవకాశాలు సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పారు. వర్సిటీ ఉపాధి, ఉద్యోగ అవకాశాల డైరెక్టర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వైకే సుందరకృష్ణ మాట్లాడుతూ సీఎస్‌ఈ విభాగం లో 134 మందికి, ఈసీఈ లో 57 మందికి, ఫార్మసీ నుంచి 105 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించినట్టు చెప్పారు. అదే సమయంలో ఈ విద్యార్థులంతా వాళ్ల తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి వాళ్ల చేతుల మీదగా ఈ ఆఫర్ లెటర్స్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాంబాబు, వర్సిటీలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఇన్చార్జులు కేజీ వెంకటకష్ణ, డాక్టర్ అలీమీర్జా, డాక్టర్ హనుమంతరావు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


