వన్యప్రాణులు విలవిల | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులు విలవిల

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

అక్రమ మైనింగ్‌తో కరిగిపోతున్న కొండలు, తగ్గుతున్న అడవులు జనావాసాల్లోకి వస్తున్న జింకలు ప్రమాదాలకు గురవుతూ మృతి చెందుతున్న వైనం వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలంటున్న ప్రజలు

పెనుగంచిప్రోలు: జగ్గయ్యపేట రేంజ్‌ పరిధిలో సుమారుగా 5 వేల హెక్టార్లలో అటవీ భూమి విస్తరించింది. దీనిలో 2 వేల హెక్టార్లలో సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం అంతా ఒకప్పుడు పచ్చని చెట్లు, కొండలతో పాటు కృష్ణమ్మ సొగసులు పర్యాటకులను కట్టి పడేసేవి. నేడు అక్రమ మైనింగ్‌లతో పాటు బ్లాస్టింగ్‌లతో అటవీ ప్రాంతం నామరూపాలు లేకుండా పోతోంది.

వన్యప్రాణులకు ఆవాసం..

జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గుండబోయినపాలెం గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో జింకలు, దుప్పులు, కుందేళ్లు, అడవి పందులు, నెమళ్లు ఉడుములతో పాటు పలు పక్షుజాతులు సంచరిస్తూ ఉండేవి. అలాగే అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు ఉన్నట్లు వృక్షశాస్త్ర నిపుణులు కూడా గుర్తించారు. ముక్త్యాలలోని రాజా గారి కోటలో ఔషధ కేంద్రం నిర్వహించటంతో పాటు అటవిలో నుంచి ఔషద మొక్కలను సేకరించేవారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

కానరాని నెమళ్లు..

కృష్ణానదీ పరివాహక ప్రాంతంతో పాటు జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయి, షేర్‌మహ్మద్‌పేట, రామచంద్రునిపేట ఉన్న అటవీ భూముల్లో గతంలో నెమళ్లు పెద్ద సంఖ్యలో ఉండేవి. అయితే అవి కూడా అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. అడవుల్లో కొండలను కొల్లగొట్టి గ్రావెల్‌ తరలిస్తుండటం, చెట్లు నరకటంతో వన్యప్రాణులు సంఖ్య తరగిపోతోంది.

రక్షణ చర్యలు నిల్‌..

అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అడవులు తగ్గిపోతుండటంతో అడవి పందులు, జింకలు, దుప్పులు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న సుబాబుల్‌ తోటల్లోకి నీటి కోసం వస్తున్నాయి. ఈక్రమంలో రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. తాజాగా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి క్రాస్‌రోడ్స్‌ వద్ద రోడ్డు దాటుతో కారు ఢీకొని మృతి చెందింది. ఈప్రాంతంలో పదుల సంఖ్యలో కనిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ముండ్లపాడులో జనావాసంలోకి వచ్చిన జింకను కుక్కలు కరవడంతో చనిపోయింది. వీరులపాడులో సోమవారం రాత్రి వేటగాళ్లు పెట్టిన ఉచ్చులో విద్యుత్‌ తీగలు తగిలి జింక మృతి చెందింది. అలాగే పెనుగంచిప్రోలు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ప్రతి ఏడాది విదేశీ పక్షులు (ఎర్రకాళ్ల కొంగలు) సందడి చేస్తుంటాయి. అవి కూడా వేటగాళ్లు ఉచ్చులో పడుతున్నాయని, వాటికి కూడా రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రావెల్‌ తవ్వకాలు నిషేధం..

అటవీశాఖ నోటిఫై చేసిన ప్రదేశంలో ఎలాంటి గ్రావెల్‌ తవ్వకాలు జరపకూడదు. వన్యప్రాణుల సంరక్షణ కోసం నీటి తొట్టెలు, కుంటలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా వీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. జగ్గయ్యపేట రేంజ్‌లో మొత్తం అటవీభూమి 5 వేల హెక్టార్లు ఉండగా, 2 వేల హెక్టార్లు సిమెంట్‌ పరిశ్రమల పరిధిలో ఉంది.

– రవివర్మ,

జగ్గయ్యపేట సెక్షన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌

Advertisement
 
Advertisement
Advertisement