ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జూన్ నెలాఖరు నాటికి టిడ్కో గృహాల పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో టిడ్కో గృహాల నిర్మాణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 11,520 టిడ్కో గృహాలను త్వరలో పూర్తి చేయాలన్నారు. జక్కంపూడిలో 6,576 గృహాలకు గాను 2,256 టిడ్కో ఇళ్లు అందించామని, మరో 4,320 ఇళ్లు లబ్ధిదారులకు అందించాల్సిన ఉందని చెప్పారు. ఇందులో జూన్ నాటికి కనీసం 3 వేల గృహాలు లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రత్యేక సబ్ రిజిస్ట్రార్ ఏర్పాటు..
జగ్గయపేటలో 2 వేలు, తిరువూరులో 672 గృహాలు జూన్ నాటికి అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జక్కంపూడి టిడ్కో గృహాల కోర్టు కేసులను వారం రోజుల్లో పూర్తి చేసి పనుల అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ రూరల్ తహసీల్దార్‌ను ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు(ఎల్‌డీఎం)ను ఆదేశించారు. ప్రతి మంగళ, గురువారాలలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి రిజిస్టేషన్‌లలో ఎదురయ్యే సమస్యలపై పరిష్కరించి రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందుకు ప్రత్యేకంగా సబ్ రిజిస్ట్రార్‌ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. సమావేశంలో వీఎంసీ కమిషనర్ హెచ్‌ఎం ధాన్యచంద్ర, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు, ఎల్‌డీఎం ఎం.ప్రియాంక, విజయవాడ రూరల్ తహసీల్దార్ బి.సుగుణ జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, టిడ్కో గృహ నిర్మాణ ఏజెన్సీలు ఎన్‌సీసీ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ లిమిటెడ్, వెల్‌కో ప్రాజెక్ట్స్ హరి ఇన్‌ఫ్రా రాఘరాం, ఎంఎస్‌ఆర్ ద్వారకా ప్రతినిధులు పాల్గొన్నారు.


