14 నుంచి టాలీలో శిక్షణ | - | Sakshi
Sakshi News home page

14 నుంచి టాలీలో శిక్షణ

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యాన ఈ నెల 14 నుంచి ‘టాలీ’లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్‌ బి.వి. రాజు ఫౌండేషన్‌ ప్రతినిధి అంకమరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 60 రోజుల పాటు ఉండే ఈ శిక్షణకు బీకామ్‌ బీబీఏ, ఎం.కామ్‌, ఎంబీఏ చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ–మెటీరియల్‌, సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కోసం 91000 33552, 93466 07845 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

వేర్వేరు ప్రాంతాల్లో

ఇద్దరు మృతి

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురంలో నివసించే సుంకరి శ్యామ్‌ దుర్గాప్రసాద్‌(34) ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన సిదిల గురుమూర్తి (33) కలిసి శుక్రవారం మధ్యాహ్నం పైపులరోడ్డులోని ఓ బార్‌లో మద్యం సేవించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత వివాదం తలెత్తి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్యామ్‌ దుర్గాప్రసాద్‌ గురుమూర్తిని కొడుతుండగా గురుమూర్తి అతని తోసేశాడు. దీంతో శ్యామ్‌ దుర్గాప్రసాద్‌ నేలపై పడిపోయాడు. అతడు లేవకపోవడంతో అక్కడ ఉన్నవారు అతని ముఖంపై నీళ్లు చల్లి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరిశీలించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కనకదుర్గానగర్‌లో..

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కనకదుర్గానగర్‌లోని బలిపీఠం వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అతడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి వయస్సు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement