గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) ఉత్సవాలను ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ డిపో, గవర్నర్‌పేట 1, 2 డిపోల వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య పాల్గొని యూనియన్ జెండా ఆవిష్కరించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే మేడే స్ఫూర్తితో ఉద్యమిస్తామన్నారు. ఎం.శంకరరావు, ఎస్కే మొహిద్దీన్, జీఎస్ నారాయణ, ఎస్‌ఎస్ నారాయణ, ఎన్‌హెచ్‌ఎన్ చక్రవర్తి, జోనల్ కార్యదర్శి వైఎస్ రావు, జిల్లా అధ్యక్షులు ఏకే సాగర్, జిల్లా కార్యదర్శి జీఎం రావు, పాల్గొన్నారు.
మేడే వారసత్వాన్ని కొనసాగించడమంటే నోయిడా పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక వర్గం సాగిస్తున్న పోరాటాలను దేశమంతా సృష్టించడమేనని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి అన్నారు. విజయవాడ బస్టాండ్ ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ , సిటీ టెర్మినల్ గేటు వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌వీవీ సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.గంగాభవాని ఎర్రజెండాలు ఎగురవేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. పోలారి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో దాది శ్రీను, సీహెచ్ పెద్దిరాజు, వై.అప్పారావు, ఏ.సూరిబాబు, రఫీ, వలీ, సుబ్బారావు, సూర్యనారాయణ, శంకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులోని మహంతి మార్కెట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సభ జరిగింది, ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని ప్రసంగించారు. కార్మిక పోరాటాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడాలన్నారు. సీఐటీయూ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


