ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, శుక్రవారం రద్దీ, వివాహ సుముహుర్తాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. గడిచిన వారం రోజులుగా నామమాత్రంగా కనిపించిన భక్తుల రద్దీ శుక్రవారం అనూహ్యంగా పెరిగింది. భక్తుల రద్దీకి తోడు ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు ఉభయదాతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. శుక్రవారం నాడు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది.
ఆర్జిత సేవలకు డిమాండ్
పౌర్ణమి నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌కు జరిగే ఖడ్గమాలార్చన రెండు షిప్టులలో, నూతన యాగశాలలో చండీహోమం, నూతన పూజామండపంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమం, రుద్రహోమంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.
శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఈవో శీనానాయక్ ఆలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. దుర్గాఘాట్ ఎదుట ఉన్న కేశకండనశాల, కనకదుర్గ్గానగర్‌లో సేద తీరుతున్న భక్తులతో మాట్లాడారు. రాత్రి 10 గంటల తర్వాత విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడో షిప్టు విధులు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహామండపం 5వ అంతస్తులోని దుకాణాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.


