ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత దుర్గగుడి ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ ఆది దంపతులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనులపండువగా సాగింది. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, సితారా, పాలప్రాజెక్టు, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు ప్రసాదాలను పంపిణీ చేసింది.


