గుర్తున్నాయా బాబూ? | - | Sakshi
Sakshi News home page

గుర్తున్నాయా బాబూ?

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

అవనిగడ్డ నియోజకవర్గంలో.. ● ఏటిమొగ–ఎదురుముండి వారధి నిర్మిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ వారధి కోసం రూ .98 కోట్లు నాబార్డు నిధులు మంజూరైనా కూటమి హయాంలో వారధి ఊసేలేదు. ● అవనిగడ్డలో శీతల గిడ్డంగి నిర్మిస్తామన్నారు ● అవనిగడ్డ డంపింగ్‌ యార్డును తరలిస్తామని చెప్పారు. ● ఎడ్లంకకు వంతెన నిర్మిస్తామని వదిలేశారు. ● అధికారం చేపట్టి దాదాపు రెండేళ్లవుతున్నా వాటి ఊసే ఎత్తని వైనం ●‘పామర్రు’కు చేసింది శూన్యమే ● నేడు పమిడిముక్కల మండలంలో సీఎం పర్యటన ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లా ప్రజలకు హామీలే హామీలు

ఎన్నికల

వాగ్దానాలను

నెరవేర్చని

చంద్రబాబు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల వేళ ఉమ్మడి కృష్ణా ప్రజలకు హామీలపై హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయినట్టున్నారు. సీఎం చంద్రబాబు శుక్రవారం పామర్రు నియోజక వర్గంలోని పమిడిముక్కల మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీల వివరాలతో ప్రత్యేక కథనం.

బాబూ మీరిచ్చిన హామీలివే

నాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరులో పాములలంక వద్ద కృష్ణా నదిపై వంతెనను ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపే నిర్మిస్తామని వాగ్దానం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న వంతెన నిర్మాణం పనులు మొదలు కాలేదు. పామర్రులో ఐటీ టవర్‌ ఏర్పాటు మాటను మరిచారు. ఈ ప్రాంతంలో 3,800 మంది లబ్ధిదారులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. తోట్ల వల్లూరులోనూ స్థలాలు ఇస్తామని జనాలను మభ్య పెట్టారు. అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలను పట్టించుకోలేదు. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వరకు రహదారి ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. పోర్టు నిర్మాణం 2026కు పూర్తి చేస్తామని చెప్పారు. పెడనలో కలంకారీ క్లస్టర్‌ నిర్మాణానికి ఇచ్చిన హామిని గాలికొదిలేశారు. బుడమేరు ఆధునికీకరణ హామీ అటకెక్కింది.

పెనమలూరు నియోజకవర్గంలో

నాడు ఉయ్యూరు ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభ సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు స్థానికంగా ఉన్న టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. ఉయ్యూరులో చక్కెర ఫ్యాక్టరీకి అనుబంధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినా అడుగు ముందుకు పడలేదు.

‘తిరువూరు’లో..

అధికారంలోకి వచ్చాక తిరువూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రూ.4,900కోట్లతో, విస్సన్నపేట మండలం పిట్లవారిగూడెం ఎత్తిపోతల పథకాన్ని రూ.6,900 కోట్లతో చేపడతామన్నారు. కట్టలేరు వాగు వద్ద వంతెన, ఎ.కొండూరు, గంపలగూడెంలో కిడ్నీ సమస్యల మూలాలను గుర్తించి పరిష్క రిస్తామన్నారు. మామిడి ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. తిరువూరు నియోజకవర్గం లో లెదర్‌ పార్క్‌ ఏర్పాటు, స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ఏర్పాటు అంటూ హడావుడి చేశారు.

‘నందిగామ’లో

గత ఏడాది ఏప్రిల్‌ 5న చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ వేదాద్రి ఎత్తిపోతల పథకం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. చందర్లపాడు మండలం ఏటూరు నుంచి కంచికచర్ల మండలం మోగులూరు మునేటిపై కాజువే నిర్మిస్తామని తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా ఇంత వరకు జరగలేదు.. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు గొట్టుముక్కలలోని ఏనుగు గడ్డ వాగుపై బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పీ4లో భాగంగా ముప్పాళ్ళ గ్రామంలో 40 కుటుంబాలు ఎంపిక చేశారు. వారిలో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే మార్గదర్శకులు ద్వారా ఆటోలు, గేదెలు ఇప్పించ్చారు. ఇలా అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు.

Advertisement
 
Advertisement
Advertisement