వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా బాలికలు పైచేయి సాధించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణ శాతం అధికంగా ఉంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 11వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదలైన ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 87.91గా నమోదైంది. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కిందకు దిగజారింది. జిల్లాలో వందరోజుల ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు కృషి చేశారు. గతేడాది ప్రభుత్వ విద్యాసంస్థల ఫలితాలు 75.90 శాతం ఉండగా ఈ ఏడాది అది మూడు శాతం పెరిగింది.
పెరిగిన బాలికల ఉత్తీర్ణత శాతం
ఈ ఏడాది కూడా జిల్లాలో బాలికలదే పైచేయి. 13,788 మంది బాలురు, 13,351 మంది బాలికలు మొత్తం 27,139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 11,786 మంది బాలురు, 12,071 మంది బాలికలు మొత్తం 23,857 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురుతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం పెరిగింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత 78.95 శాతం
ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 4,999 మంది బాలురు, 5,960 మంది బాలికలు మొత్తం 10,959 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో బాలురు 3,658 మంది, బాలికలు 4,994 మంది మొత్తం 8,652 మంది ఉత్తీర్ణత సాధించి 78.95 శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి 8,789 మంది బాలురు, 7,391 మంది బాలికలు మొత్తం 16,180 మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 8,128 మంది బాలురు, 7,077 మంది బాలికలు మొత్తం 15,205 మంది ఉత్తీర్ణతను సాధించి 93.97 శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 79 విద్యాసంస్థలు నూరు శాతం ఫలితాలను సొంతం చేసుకున్నాయి. అందులో 12 ప్రభుత్వ విద్యాసంస్థలు, 67 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఒక్క ప్రైవేట్ విద్యాసంస్థ మాత్రం జీరో ఫలితాలను సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
వత్సవాయి మొదటి స్థానం.. విజయవాడ రూరల్ చివర
జిల్లాలో విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్‌లు ఉండగా అందులో 20 మండలాలు కొనసాగుతున్నాయి. 20 మండలాల్లో వత్సవాయి మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు 92.70 శాతం ఫలితాలను సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో రెడ్డిగూడెం (91.03), పెనుగంచిప్రోలు మండలం (89.89) ఫలితాలను సాధించాయి. చివరి స్థానంలో నందిగామ మండలం (64.98) నిలిచింది.
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌స్కూల్) ఆధ్వర్యంలో జరిగిన పది, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ గురువారం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా పదో తరగతికి సంబంధించి 4.45 శాతం ఉత్తీర్ణతను సాధించగా, ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 24.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్మీడియెట్‌లో 1,232 మంది బాలురు, 791 మంది బాలికలు మొత్తం 2,023 మంది పరీక్ష రాయగా అందులో 255 మంది పురుషులు, 244 మంది బాలికలు మొత్తం 499 మంది ఉత్తీర్ణతులయ్యారు. పదో తరగతిలో 683 మంది బాలురు, 530 మంది బాలికలు మొత్తం 1,213 మంది పరీక్ష రాయగా అందులో 19 మంది బాలురు, 38 మంది బాలికలు మొత్తం 54 మంది ఉత్తీర్ణులయ్యారు. మే 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థులు మే 2 నుంచి 11వ తేదీ వరకూ ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రుసుంను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
గోసిపాట నిత్యశాత్విక
జిల్లా మూడో స్థానం
ఎండీ అఖిలా ఫార్హీన్
జిల్లా మొదటి స్థానం


